ఇక ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే మైనర్ ఖనిజాల వేలం..ప్రభుత్వ భూముల్లో హైబ్రీడ్ అప్రోచ్ విధానం అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు

ఇక ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే మైనర్ ఖనిజాల వేలం..ప్రభుత్వ భూముల్లో హైబ్రీడ్ అప్రోచ్ విధానం అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు
  • స్టాట్యుటరీ క్లియరెన్స్‌‌‌‌లతో పనిలేకుండానే మైనింగ్ బ్లాకుల కేటాయింపు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మైనర్ ఖనిజాల తవ్వకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మైనింగ్ బ్లాకుల వేలం ప్రక్రియలో మార్పులు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ ‘హైబ్రిడ్ అప్రోచ్’  విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ భూముల్లోని మైనర్ ఖనిజ బ్లాకులను ముందస్తు అనుమతులు ఉన్నా, లేకపోయినా వేలం వేయనున్నారు. దీనివల్ల వేలం ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.

గతంలో మైనింగ్ బ్లాకులను వేలం వేసేటప్పుడు కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉండేవి. అయితే గుజరాత్‌‌‌‌లోని గాంధీనగర్‌‌‌‌లో జరిగిన ‘చింతన్ శివిర్’ వేదికగా కేంద్ర గనుల శాఖ ఇచ్చిన సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త హైబ్రిడ్ పద్ధతిని స్వీకరించింది. ఈ విధానంలో మైనింగ్ శాఖే అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు పొంది బ్లాకును వేలం వేస్తుంది. వేలంలో గెలిచిన వారు 7 రోజుల్లో 25 శాతం, నెల రోజుల్లో మిగిలిన 75 శాతం నగదు చెల్లిస్తే సరిపోతుంది.  క్లియరెన్స్‌‌‌‌లు లేకుండా అనుమతులు లేని బ్లాకులను కూడా వేలం వేస్తారు. వేలంలో గెలిచిన వారు ముందుగా 25 శాతం నగదు చెల్లించి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ చేసుకోవాలి. ఆ తర్వాత ఆరు నెలల్లోగా పర్యావరణ, ఇతర అనుమతులు వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.

పారదర్శకతకు పెద్దపీట.. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే వేలం

వేలం ప్రక్రియ అంతా ఆన్‌‌‌‌లైన్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌‌‌‌ఫామ్ ద్వారానే నిర్వహించనున్నారు. కనీసం ముగ్గురు అర్హులైన బిడ్డర్లు ఉంటేనే వేలం నిర్వహిస్తారు. అత్యధిక ధర కోట్ చేసిన వారికే బ్లాక్ కేటాయిస్తారు. ఒకవేళ సక్సెస్‌‌‌‌ఫుల్ బిడ్డర్ నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోతే, రెండో స్థానంలో ఉన్న బిడ్డర్‌‌‌‌కు అవకాశం ఇస్తారు. భూ యజమానుల సమ్మతితో వేలం వేసే పట్టా భూముల్లో వారికి అదనంగా సీనియరేజ్ ఫీజులో 5 నుంచి 10 శాతం వరకు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ పర్యవేక్షణలో ఈ కొత్త వేలం నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏవైనా కొత్త ఖనిజాలు బయటపడితే నిబంధనల ప్రకారం వాటిని కూడా లీజులో చేర్చుకోవచ్చు. ఈ కొత్త విధానంతో మైనింగ్ రంగంలో వేగం పెరగడమే కాకుండా, రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.