హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో షార్ట్ టర్మ్ ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణకు సంబంధించి కాలేజీలు, ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2026 జనవరి నుంచి జూన్ వరకు జరిగే రెండో విడత కోర్సులకు గాను.. కొత్తగా అఫిలియేషన్, అదనపు కోర్సులు లేదా సెక్షన్ల మంజూరు కోసం మేనేజ్‌మెంట్లు అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ఎన్జీవోలు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఈ కోర్సుల నిర్వహణకు అర్హులని చెప్పారు.
ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 24 నుంచి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు www.sive.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. కనీసం రెండు కోర్సుల నుంచి గరిష్టంగా 9 కోర్సుల వరకు అనుమతి ఇవ్వనున్నట్టు వివరించారు.
