విదేశీ పెట్టుబడుల్లో  7వ ప్లేస్​లో తెలంగాణ

విదేశీ పెట్టుబడుల్లో  7వ ప్లేస్​లో తెలంగాణ
  •     2019-2021 మధ్య వచ్చిన ఎఫ్​డీఐలు రూ.28,260 కోట్లే  
  •     తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్​  
  •     చిన్న రాష్ట్రం హర్యానాలోనూ ఎక్కువ ఎఫ్​డీఐలు  
  •     పొల్యూటెడ్ సిటీ ఢిల్లీలోనూ భారీగా ఇన్వెస్ట్​మెంట్లు

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు క్యూ కడ్తున్నయ్.. ఆయా సంస్థలకు హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ డెస్టినేషన్..’’ అంటూ మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకూ ఆయన వరుసగా హాజరవుతున్నారు. అక్కడ అనేక కంపెనీలతో చర్చలూ జరుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు కూడా వచ్చాయి. కానీ ఫారిన్​డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్(ఎఫ్ డీఐ)లను రాబట్టే విషయంలో మిగతా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కాస్తంత వెనుకంజలోనే నిలిచింది.

రాష్ట్రంలో అన్ని సౌలతులతో, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నా.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విదేశీ పెట్టుబడులు మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్​సభలో వెల్లడించిన డేటాతో ఈ విషయం స్పష్టమైంది. 2019 నుంచి 2021 మధ్య మూడేండ్లలో రాష్ట్రానికి వచ్చిన ఎఫ్ డీఐలు కేవలం 3,442 మిలియన్ డాలర్లే. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.28,260 కోట్లే వచ్చాయి. ఈ జాబితాలో మన రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది. ఈ విషయంలో బెంగళూరుతో మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు పోల్చి చెప్పారు. కానీ కర్నాటకకు వచ్చిన ఎఫ్​డీఐలు మన కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. 

రూ.3.21 లక్షల కోట్లతో.. మహారాష్ట్ర టాప్  

ఎఫ్​డీఐలు అత్యధికంగా రాబట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రానికి సుమారు రూ.3.21 లక్షల కోట్లు (39,164 మిలియన్ డాలర్లు) ఎఫ్​డీఐల రూపంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ జాబితాలో కర్నాటక సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మూడేండ్లలో ఆ రాష్ట్రం సుమారు రూ.2.8 లక్షల కోట్ల (34,401 మిలియన్ డాలర్లు) ఎఫ్​డీఐలను ఆకర్షించగలిగింది. ఇక గుజరాత్​కు రూ.2.23 లక్షల కోట్ల ఎఫ్​డీఐలు రాగా.. పెట్టుబడుల విషయంలో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీకి రూ.1.45 లక్షల కోట్లు, తమిళనాడుకు సుమారు రూ.51,960 కోట్లు, హర్యానాకు రూ.42,850 కోట్ల మేర ఎఫ్​డీఐలు వచ్చాయి.

మన కన్నా చిన్న రాష్ట్రం అయిన హర్యానా, అత్యంత పొల్యూటెడ్​ సిటీ అయిన ఢిల్లీకి సైతం ఎక్కువ ఎఫ్​డీఐలు వచ్చాయి. మొత్తంగా 2019–2021 మధ్య కాలంలో దేశానికి వచ్చిన ఎఫ్​డీఐల విలువ సుమారు రూ.11.68 లక్షల కోట్లు అని కేంద్రం వెల్లడించింది.