- ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అవసరం
- టీడీఎఫ్యూఎస్ మాజీ చైర్మన్ గాదె గోపాల్‌రెడ్డి
ఖైరతాబాద్,వెలుగు: రాష్ట్రంలో విద్య అట్టడుగుస్థాయికి పోయిందని, ప్రయివేటు విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు నియంత్రణ కోల్పోయారని టీడీఎఫ్యూఎస్ మాజీ చైర్మన్ గాదె గోపాల్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో ఉందన్నారు. పాఠశాలలోనే విద్యార్థికి సరైన పునాది పడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అవసరమని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ‘తెలంగాణ విద్యారంగ సమస్యలు– వాటి పరిష్కారాలు’ అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించడం దారుణమన్నారు. అక్కడి అధ్యాపకులకు వీరికంటే జీతం తక్కువ, శిక్షణ సరిగా ఉండదని, మరి ఎందుకు ప్రయివేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీషులో చదివితేనే ఉద్యోగాలు వస్తాయా..? అని ప్రశ్నించారు. పాఠశాల విద్య నుంచి మాతృభాషలోనే పిల్లలకు అందించాలని, అది కూడా నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు అందిస్తే చైనాతో పోటీ పడి మనం కూడా ఉత్పత్తులను తయారు చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులకు పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తే మాల్‌ప్రాక్టీసుకు అవకాశం ఉండదని ప్రొఫెసర్ శివారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈనెల 21,22, తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో జరిగే విద్యా సదస్సులో ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో యూఎస్ టీడీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధు కె. రెడ్డి, టీడీఎఫ్ ఇండియా చైర్మన్ఎం.గోనారెడ్డి, మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాటి, సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ ఏపూరు పాల్గొన్నారు.

