- రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.20 శాతమే.. జాతీయ సగటు 1.72%
- 2035 నాటికి 201 బిలియన్ డాలర్లకు హైదరాబాద్ ఎకానమీ
- ఐటీ, ఫైనాన్స్‌లో 40% వాటా తెలంగాణ సహా 4 రాష్ట్రాలదే
- వీహబ్, షీటీమ్ సేవలు భేష్ అని కొనియాడిన కేంద్రం
- హైదరాబాద్–వరంగల్ మధ్య నమో భారత్ రైలుకు ప్రతిపాదన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ.. ఒక గ్రోత్ మోడల్ అని ఎకనమిక్‌సర్వే నివేదికలో కేంద్రం ప్రశంసించింది. వ్యవసాయంలో, ఐటీలో ఎగుమతుల జోరు, పట్టణీకరణలో హైదరాబాద్ వేగం, మహిళా సాధికారతలో వినూత్న పథకాలు.. వెరసి తెలంగాణను దేశ ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలబెట్టాయని పేర్కొంది. వాతావరణ మార్పుల వంటి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలు తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ముఖచిత్రంలో తెలంగాణ చెరగని ముద్ర వేస్తున్నదని.. వ్యవసాయం, సేవారంగం, మౌలిక వసతులు, మహిళా సాధికారత.. ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నదని వెల్లడించింది.
హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా మారుతున్న తీరును, పెరుగుతున్న ఆర్థిక సాంద్రతను గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. డిజిటల్ గవర్నెన్స్, భూరికార్డుల ప్రక్షాళనలోనూ తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడింది. దేశ జీడీపీలో సింహభాగం ఆక్రమిస్తున్న సేవారంగంలో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం కొనసాగుతున్నదని పేర్కొంది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి హై-ఎండ్ సేవల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపింది.
దేశవ్యాప్తంగా సేవారంగం ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటాను కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలే కలిగి ఉన్నాయని చెప్పింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘వీ-హబ్ ’ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది మహిళలను స్టార్టప్ ఎకో సిస్టమ్‌తో, ఇన్వెస్టర్లతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొంది. హైదరాబాద్‌లో అమలు చేస్తున్న ‘షీ టీమ్స్’ వ్యవస్థను ప్రశంసించింది.
అత్యల్ప ద్రవ్యోల్బణం..
2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి గాను దేశవ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం జాతీయ ద్రవ్యోల్బణం సగటు 1.72 శాతం ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ధరల పెరుగుదల లేదు. తెలంగాణలో ద్రవ్యోల్బణం కేవలం 0.20 శాతంగా మాత్రమే నమోదైంది. దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల జాబితాలో బిహార్, ఒడిశా, అస్సాం తర్వాత తెలంగాణ నిలిచింది.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ధరలు మండిపోతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం ఏకంగా 8.05 శాతానికి ఎగబాకింది. ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ట పరిమితి (6%)ని దాటిన ఏకైక పెద్ద రాష్ట్రం కేరళ కావడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో లక్షద్వీప్ (6.69%), గోవా (4.77%) ఉన్నాయి. మరోవైపు దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం బిహార్‌లో (0.01%) నమోదైంది. అంటే అక్కడ ధరల పెరుగుదల అసలే లేదని అర్థం. ఒడిశా (0.12%), అస్సాం (0.16%) కూడా అత్యల్ప ధరల జాబితాలో ఉన్నాయి.
హైదరాబాద్‌లో అభివృద్ధి పరుగులు..
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతోందని సర్వే తెలిపింది. ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్’ డేటా ప్రకారం.. 2019–35 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-10 నగరాల జాబితాలో హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో సూరత్ (9.17%), ఆగ్రా (8.58%), బెంగళూరు (8.50%) ఉండగా.. హైదరాబాద్ 8.47% వృద్ధి రేటుతో నాలుగో స్థానంలో నిలిచింది.
చెన్నై, విజయవాడ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే.. 2018లో 50.6 బిలియన్ డాలర్లుగా ఉన్న హైదరాబాద్ జీడీపీ (స్థిర ధరల వద్ద) 2035 నాటికి ఏకంగా 201.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇక నగరాల విస్తరణను అంచనా వేసేందుకు ఇస్రోకు చెందిన ‘భువన్’ ఉపగ్రహం ద్వారా తీసిన ‘నైట్ టైమ్ లైట్స్’ చిత్రాలను సర్వే విశ్లేషించింది.
2012లో హైదరాబాద్ నగర పరిధిలోనే వెలుగులు కేంద్రీకృతమై ఉండగా, 2023 నాటికి అవి నగర శివార్లకు అంటే పటాన్‌చెరు, శంషాబాద్, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాలకు విస్తరించాయి. నైట్ లైట్స్ రేడియన్స్ గణనీయంగా పెరగడం.. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు, జన సాంద్రత పెరగడాన్ని సూచిస్తోందని సర్వే పేర్కొంది. పాత మున్సిపల్ సరిహద్దులను దాటి హైదరాబాద్ ఒక రిబ్బన్ తరహాలో చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుంటూ విస్తరిస్తోందని, ఇది మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధికి నిదర్శనమని విశ్లేషించింది.
హైదరాబాద్ టు వరంగల్.. ఆర్ఆర్‌టీఎస్
పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఢిల్లీ–-మీరట్ మధ్య నిర్మించిన ‘రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్)’/‘నమో భారత్’ రైలు విజయాన్ని సర్వే ప్రస్తావించింది. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తోంది. ఇదే తరహాలో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మెగా రీజియన్లను కలిపే కారిడార్లను గుర్తించినట్లు సర్వే తెలిపింది.
ఇందులో ‘హైదరాబాద్ – వరంగల్’ కారిడార్ కూడా ఉండటం విశేషం. బెంగళూరు-–మైసూర్, చెన్నై-–తిరుపతి తరహాలోనే హైదరాబాద్-–వరంగల్ మధ్య కూడా ఈ హైస్పీడ్ రైలు వచ్చే అవకాశాలను ప్రస్తావించింది. ఇది కార్యరూపం దాల్చితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గంటలోపుకు తగ్గడంతో పాటు వరంగల్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందని అంచనా.
వరికి ప్రత్యామ్నాయ పంటలు అవసరం..
తెలంగాణలో సాగు విస్తీర్ణం అమాంతం పెరిగినప్పటికీ, వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్ర రైతాంగంపై తీవ్రంగా పడుతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో సాగు విస్తీర్ణం కేవలం 1.31 కోట్ల ఎకరాలుగా మాత్రమే ఉండగా.. అది 2022–23 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని వెల్లడించింది. అయితే రాష్ట్రంలో హెక్టారుకు వచ్చే వడ్ల దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైందని పేర్కొంది.
వరి పండించే రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ ఈ పరిస్థితి నెలకొందని.. అకాల వర్షాలు, వడగాల్పులు ఇందుకు కారణమని విశ్లేషించింది. ఇది భవిష్యత్తులో ఆహార భద్రతకు సవాలుగా మారే ప్రమాదం ఉందని, రైతులు వాతావరణాన్ని తట్టుకునే వంగడాల వైపు, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని తెలిపింది.
ఏఐ స్టార్టప్స్‌లోనూ సత్తా..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) స్టార్టప్స్‌లోనూ తెలంగాణ సత్తా చాటుతోంది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ‘జనరేటివ్ ఏఐ’ స్టార్టప్స్‌కు వస్తున్న నిధుల్లో 7 శాతం వాటా తెలంగాణకు దక్కుతోం దని సర్వే తెలిపింది. దేశంలో బెంగళూరు (-39%), ముంబై (14%), ఢిల్లీ (9%) తర్వాత తెలంగాణలోని స్టార్టప్స్ ఈ రంగంలో రాణిస్తున్నాయి.
సర్వేలోని మరిన్ని అంశాలు..
డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘భూభారతి ’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిందని సర్వే పేర్కొంది. ఈ సింగిల్ విండో సిస్టమ్ వల్ల భూ రికార్డులు పక్కాగా ఉంటున్నాయని, భూ వివాదాలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది.
దేశంలో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు (సున్నపురాయి) లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కీలకమని సర్వే తెలిపింది. రాజస్థాన్, ఏపీ, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోనూ సిమెంట్ పరిశ్రమ కేంద్రీకృతమై ఉందని.. దేశంలోని మొత్తం సిమెంట్ పరిశ్రమలో 85 శాతం వాటా ఈ రాష్ట్రాల్లోనే ఉందని వెల్లడించింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2025 డేటా ప్రకారం.. దేశంలోని అత్యుత్తమ 100 విద్యాసంస్థల్లో 40% సంస్థలు దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళతో పాటు ఢిల్లీలో ఉన్నాయని సర్వే పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని యూనివర్సిటీల్లో మహిళల ఎన్‌రోల్ మెంట్ కూడా పెరుగుతోందని సర్వే తెలిపిం ది. జాతీయ సగటు (0.93) కంటే మెరుగైన జెండర్ పారిటీ ఇండెక్స్‌ను తెలంగాణ కలిగి ఉందని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఉన్నత విద్య వైపు మళ్లుతున్నారనడానికి నిదర్శనమని పేర్కొంది.
