దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలి : ప్రియాంక గాంధీ

దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలి : ప్రియాంక గాంధీ
  • కేసీఆర్​ పాలన అంతా అవినీతిమయం..
  • దానికి ఎక్స్​పైరీ డేట్​ దగ్గరపడ్డది: ప్రియాంక గాంధీ
  • రాష్ట్రాన్ని ఆగం పట్టిచ్చిండు
  • ప్రజల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొట్టి.. 
  • ఎన్నికల్లో పంచేందుకు సిద్ధమైండు
  • బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే
  • దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలి
  • కాంగ్రెస్​ వెంటే జనం.. బైబై కేసీఆర్​
  • తొర్రూరు, హుస్నాబాద్​ సభల్లో వ్యాఖ్యలు

మహబూబాబాద్​/ సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్​వన్​గా ఉందని, రాష్ట్రాన్ని కేసీఆర్​ ఆగం పట్టించారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పోరాటాలు, త్యాగాలు, కాంగ్రెస్​ సహకారంతో ఏర్పడిన తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. గ్రూప్స్ ఎగ్జామ్స్​ నిర్వహించడంలో బీఆర్​ఎస్​ సర్కార్​ పూర్తిగా ఫెయిలైందని, ఎంతో కష్టపడి చదివిన స్టూడెంట్లు తరచూ పేపర్ల లీకేజీల వల్ల మానసికంగా కుంగిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎగ్జామ్స్​సరిగ్గా జరగక, ఉద్యోగాలు రాక కొందరు ఆత్మహత్యకు పాల్పడితే బీఆర్ఎస్ ​ప్రభుత్వం వారిని అవమానించేలా దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను చీకటిలోకి నెట్టేస్తున్నదని అన్నారు. ‘‘బీఆర్​ఎస్​ ప్రభుత్వ అవినీతి, కుంభ కోణాల మూలంగానే క్వశ్చన్ పేపర్ల లీకేజీ జరిగింది. దేశానికి పట్టుకొమ్మలైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ, బీఆర్​ఎస్​ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు” అని ఫైర్​ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ప్రియాంక మాట్లాడారు. 

రైతులు, కూలీలు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్​ఇవ్వాలని రెక్కలు ముక్కలు చేసుకుని విద్యా బుద్ధులు చెప్పిస్తే బీఆర్​ఎస్​సర్కార్​ వల్ల ఉద్యోగాలు దొరకక వారంతా అల్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు బడా బడా సంస్థలకు గులాము చేస్తూ పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కింది నుంచి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతున్నదని, బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. 

అభివృద్ధిలో కాదు.. నిరుద్యోగంలో తెలంగాణ నంబర్​ వన్​గా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, కనీస రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్​ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. 

బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం ఒక్కటే

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడి ఎజెండాతో పనిచేస్తున్నాయని, అందులో ఏ పార్టీకి ఓటు వేసినా ఒక్కటేనని ప్రియాంక అన్నారు.  దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 50 సీట్ల వరకు పోటీ చేసే ఎంఐఎం ఇక్కడ సొంత మిత్రుల కోసం కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నదని విమర్శించారు. ‘‘దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ వచ్చే వరకు ప్రజలు పోరాటం కొనసాగించాలి. చేయి చేయి కలిపి..  చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​అభ్యర్థులను  గెలిపించాలి” అని కోరారు. 

వర్షం కారణంగా తాను సభా స్థలికి చేరుకోవడం ఆలస్యమైనా మహిళలు, యువకులు ఓపికతో వేచి ఉండడం ఆనందంగా ఉందన్నారు.  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి, గండిపల్లి , తోటపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతుల పొలాలకు నీళ్లు అందడం లేదన్నారు. ‘‘ప్రాజెక్టుల పేరిట బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించినా సరైన పరిహారాలు ఇవ్వలేదు. రైతులు , పేదలు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎప్పుడూ నోరు తెరవ లేదు. 

ప్రజల పక్షాన పోరాటం చేయని ఇలాంటి ఎమ్మెల్యే అవసరమా?” అని ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ సక్రమంగా జరగడం లేదన్నారు. అదానీ ఆదాయం రోజుకు రూ.16 వేల కోట్లకు చేరిందంటే ప్రధాని మోదీ ఏ మేరకు ఆయనకు మద్దతునిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రియాంక అన్నారు.  తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే నడుస్తున్నాయని, ఓటర్లు ఆలోచించి విచక్షణతో ఓట్లు వేయాలని కోరారు.  కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని, అందుకే ఆరు గ్యారంటీలను ప్రకటించిందని వివరించారు.  

జాబ్​ క్యాలెండర్​ అమలు చేస్తం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్​అమలు చేస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో పరీక్షలు, ఫలితాలు, నియామకాల తేదీలు ముందే ప్రకటిస్తం. ఉన్నత విద్య కోసం ఒక్కో స్టూడెంట్​కు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తం. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్​లెవల్ స్కూల్​ఏర్పాటు చేస్తం. అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.2,500,  రూ.500కే గ్యాస్ ​సిలిండర్ అందిస్తం. మహిళలకు  ఫ్రీగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తం’’ అని ఆమె హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తమ కుటుంబానికి ఆప్తులని, నానమ్మ ఇందిరా గాంధీతో పనిచేయడమే కాకుండా నాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తమ కుటుంబానికి అండదండలు అందించారని గుర్తుచేసుకున్నారు. 

బైబై కేసీఆర్...

పదండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల సమస్యలకు పరిష్కారం దొరకలేదని కేసీఆర్ కు బైబై చెప్పాలంటూ  ప్రజలతో ‘బై బై కేసీఆర్’ అని ప్రియాంకగాంధీ అనిపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో సర్వాయి పాపన్నను గుర్తు చేశారు.  హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. ఆయా సభల్లో ​మాణిక్​రావ్​ ఠాక్రే, కోదండరాం, పొన్నం ప్రభాకర్​, యశశ్వినిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.  

పేద మహిళ ఇంటికి ప్రియాంక 

ప్రియాంక  గాంధీ ఓ పేదింటి మహిళ ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొన్న ప్రియాంక.. అక్కడి నుంచి తిరిగి వెళ్తూ దగ్గర్లోని కిషన్​నగర్ గ్రామంలో జాగీరు రమాదేవి ఇంటికి వెళ్లారు. ఆమెను హత్తుకుని, కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ‘ఆప్​కా భయ్యాజీ ఆగయా’ అంటూ కుటుంబానికి తోడుంటానని భరోసా ఇచ్చారు. తనను ఉత్తరప్రదేశ్ లో అందరూ భయ్యాజీ అంటారని, భయ్యాలాగా మీకు తోడుంటానని చెప్పారు.     
– హుస్నాబాద్, వెలుగు