కరీంనగర్: ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు కేసీఆర్ అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. తెలంగాణను ఆంధ్రాలో కలుపుతానని ఒకరు, తెలంగాణ ఎందుకొచ్చిందని ఇంకొకరు మాట్లాడుతున్నారు.. తెలంగాణ అంటే వీళ్లందరికీ ఈర్ష్య..అందుకే ఇలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉంటే ఈర్ష్య అని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. మేయర్ సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ పథకం కింద లబ్ది కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యమవుతోందే తప్ప... చెక్కుల రిలీజ్ లో ఎలాంటి జాప్యం జరగడం లేదన్నారు. ఎన్నికలొస్తుంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మీ దగ్గరకు వస్తారని.. మీరందరూ వారిని నిలదీయాలన్నారు. మీకు ఓటేస్తే మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారా..? అని ఆడబిడ్డలు అడగాలన్నారు. కేసీఆర్ ను మనమే ముఖ్యమంత్రిగా చేసుకున్నాం, ఆయనను మనమే కాపాడుకోవాలని మంత్రి గంగుల సూచించారు. ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం తరపున లక్ష రూపాయలిచ్చి మేనమామలా ఆదుకుంటున్నారు.. అలాగే కేసీఆర్ కిట్ రూపంలో ప్రసవం కోసం కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం.. పుట్టిన బిడ్డల కోసం గురుకులాలు పెట్టించి చదివిస్తున్నాం... ఇలాంటి వందల పథకాలు అమలు చేస్తున్నాం.. ఇన్ని స్కీంలు అమలు చేస్తున్న కేసీఆర్ చల్లగా బతకాలని మనం దీవనలందించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 50 ఏళ్లు టీడీపీ, కాంగ్రెస్ పాలించినా.. ఏనాడూ పేదల కోసం వారు ఆలోచించలేదన్నారు. కరెంట్ లేక, తాగునీరు, సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇలాంటి స్కీంలు లేవని.. కేసీఆర్ లాగా ఏ నాయకుడు ఆలోచించలేదన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకోసమేనని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్