ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్

ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న  భారతీయులపై  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న 20వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వెంటనే ఉక్రెయిన్ పరిస్థితులను సమీక్షించి, భారతీయులను కాపాడే చర్యలు మొదలు పెట్టారన్నారు. కరీంనగర్ నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను నిన్న రాత్రి వరకు కలిసి, వారికి భరోసా కల్పించామన్నారు. పలువురు విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడానన్నారు బండి సంజయ్. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చిందన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మోడీ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర పార్టీ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. మాకొచ్చిన నెంబర్లకు వీడియో కాల్ చేసి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.