పాలిటిక్స్ పక్కా చేస్త!..ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటదో చూపిస్త: జాగృతి అధ్యక్షురాలు కవిత

పాలిటిక్స్ పక్కా చేస్త!..ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటదో చూపిస్త: జాగృతి అధ్యక్షురాలు కవిత
  • నా రాజకీయం చివరి ఏడాదిలో చూపిస్తా
  • బీఆర్‍ఎస్‍ పాలనలో నన్ను నిజామాబాద్​కే పరిమితం చేసిన్రు
  • సీఎం బిడ్డనైనా అభివృద్ధి పనులకు నిధులు ఇయ్యలే
  • బీఆర్‍ఎస్‍ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు
  • తండ్రిగా కేసీఆర్‍ పిలిస్తే వెళ్తా.. రాజకీయంగా వెళ్లే ప్రసక్తే లేదని వెల్లడి

వరంగల్‍, వెలుగు: తాను పాలిటిక్స్ పక్కా చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటదో చూపిస్తానని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో చేపట్టిన రెండ్రోజుల జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍ క్లబ్‍లో మీడియాతో కవిత మాట్లాడారు. ‘‘నేను పాలిటిక్స్ పక్కా చేస్తా. రాణి రుద్రమ నేల సాక్షిగా ఈ గడ్డమీద నుంచి చెప్తున్నా.

 ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటదో చూపిస్తా. కానీ.. ఇప్పుడు కాదు. చివరి ఏడాదిలో చూపిస్తా. ఇప్పుడు మాత్రం కేవలం ప్రజాసమస్యలపైనే పోరాటం చేస్తా” అని అన్నారు. బీఆర్‍ఎస్‍ పార్టీలో తనను ప్రొటోకాల్‍ పేరుతో నిజామాబాద్ దాటకుండా అక్కడి వరకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు అడిగితే కూడా ఇవ్వలేదని.. సీఎం బిడ్డనైనా కొన్ని పనులు చేసుకోవడానికి ఏడాది తిరగాల్సి వచ్చిందన్నారు. 

చివరకు ఒక టీచర్‍ను ట్రాన్స్​ఫర్‍ చేసుకోలేని పరిస్థితులు ఉండేవని చెప్పారు. పార్టీలో 20 ఏండ్లు పనిచేస్తే కనీసం షోకాజ్‍ నోటీసు కూడా ఇవ్వకుండా అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను తెలంగాణ ఆడబిడ్డను.. ఆకలినైనా తట్టుకుంటాను కానీ, అవమానాన్ని మాత్రం తట్టుకోను’’ అని తేల్చిచెప్పారు.

 బీఆర్‍ఎస్‍ పార్టీతో రాజకీయంగా తనకు ఇక ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. తండ్రిగా కేసీఆర్‍ తనను పిలిస్తే వెళ్లి తల్లిదండ్రుల యోగక్షేమాలు కోరుతా తప్ప.. రాజకీయంగా వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ నిర్లక్ష్యంతోనే.. వరంగల్​లో వరదలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‍.. పదేండ్ల బీఆర్‍ఎస్‍ పాలన, రెండేండ్ల కాంగ్రెస్‍ పాలనతోనే వరదల్లో మునుగుతోందని కవిత ఆరోపించారు. స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన రూ.900 కోట్లలో బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం రూ.200 కోట్లు భద్రకాళి చెరువులో పోసి.. నాలా నిర్మాణాలను మధ్యలో అడ్డదిడ్డంగా వదిలేయడంతోనే వరంగల్‍ సిటీ వరదలకు కారణమైందన్నారు.

 ప్రస్తుత కాంగ్రెస్‍ ప్రభుత్వం సైతం మరో రూ.300 కోట్లను అదే చెరువులో పోసింది తప్ప.. వరదల పరిష్కారానికి నాలాలను నిర్మించడంలో విఫలమైందన్నారు. జిల్లానుంచి ఇద్దరు మహిళా మంత్రులున్నా.. ఎంజీఎంలో, కాకతీయ యూనివర్సిటీల్లో మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదన్నారు. మేడారం జాతర పనులు ఆదివాసీలకు దక్కకుండా అన్యాయం చేశారన్నారు. 

వారికి నచ్చినవారికి పనులు కట్టబెట్టారని ఆరోపించారు. కాకతీయ వర్సిటీలో 1,100 మంది ఇంజనీరింగ్‍ విద్యార్థినులకు హాస్టల్​లేక బయట ఉంటూ చదువుకుంటున్నారన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కేవలం స్థానిక ఎన్నికలకే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చట్టసభల్లోనూ అవకాశం రావాలన్నదే తన లక్ష్యమన్నారు.

వరంగల్‍  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు 600 కోట్ల అవినీతి!

వరంగల్‍ లో నిర్మిస్తున్న ప్రభుత్వ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్​లో మాజీ మంత్రి హరీశ్​రావు రూ.600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్‍ చేశారు. రాష్ట్రంలో బీఆర్‍ఎస్‍ ప్రభుత్వ పదేండ్ల పాలనలో జరిగిన వేల కోట్ల అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. 

అప్పటి హెల్త్​మినిస్టర్‍ హరీశ్​రావు బినామీ కంపెనీ నిర్మిస్తున్న ఆస్పత్రి పనుల్లో అనుకున్నదానికంటే ఒక్క ఫ్లోర్‍ కూడా పెరగకుండానే రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు నిర్మాణ ఖర్చు ఎలా పెంచారని ఆమె ప్రశ్నించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం విచారణ రిపోర్ట్​ను త్వరగా తెప్పించుకుని బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్‍ చేశారు. రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకున్నోళ్లు ఇండ్లకే పరిమితమయ్యారని కవిత ఎద్దేవా చేశారు.