- ఆయన అత్యంత అవినీతిపరుడని ఫైర్
వనపర్తి, వెలుగు: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోద్దని బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. ‘‘తండ్రి వయసున్న వ్యక్తి అని ఇన్నాళ్లూ నిరంజన్‌రెడ్డిని గౌరవించాను. కానీ ఆయన నాపై ఇష్టమున్నట్టు విమర్శలు చేస్తున్నారు. సచ్చు వంకా య, పుచ్చు వంకాయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది సరైంది కాదు. నామీద ఎటుపడితే అటు మాట్లాడితే.. ఇక ఊరుకునేది లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోద్ది. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి” అని హెచ్చరించారు. జాగృతి జనం బాటలో భాగంగా వనపర్తిలో పర్యటిస్తున్న కవిత.. సోమవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
నిరంజన్ రెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. ‘‘జిల్లాలో ఎవరిని కదిలించినా నిరంజన్ రెడ్డి దారుణాలను కళ్లకు కడుతున్నారు. 32 మంది బీసీల మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టి సతాయిస్తారా? ఇంత దారుణమా? అతనికి మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి.
అసైన్‌మెంట్ ల్యాండ్స్, ఆర్‌డీఎస్ కోసం సేకరించిన భూములు లాక్కున్నాడు” అని ఫైర్ అయ్యారు. వనపర్తిలో జర్నలిస్టులకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్‌ను పూర్తి చేయకుండా, ఒక్క ఎకరానికి నీళ్లివ్వకపోయినా.. ఆయనకాయనే నీళ్ల నిరంజన్‌రెడ్డి అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
నిరంజన్ రెడ్డిని హరీశ్ కాపాడుతున్నడు..
నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో ఉంటే జిల్లాలో పార్టీ బతికి బట్టకట్టదని కవిత వ్యాఖ్యానించారు. ‘‘నిరంజన్ రెడ్డి అరాచకాలను కేసీఆర్‌కు హరీశ్ రావు తెలియనివ్వటం లేదు. అందుకే మీడియా ద్వారా పెద్ద సార్‌కు చెబుతున్నాను. ఆలంపూర్ ప్రాంతంలో ఒక తహసీల్దారు ఆఫీసును కాలబెట్టిన విషయం కేసీఆర్‌కు తెలియకపోవచ్చు.
ఆ విషయం కేసీఆర్‌కు తెలియకుండా హరీశ్ మేనేజ్ చేసి ఉండొచ్చు” అని పేర్కొన్నారు. ‘‘మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అత్యంత అవినీతికి పాల్పడ్డారు. గత పదేండ్లలో జిల్లాలో అభివృద్ధేమీ జరగలేదు. ప్రజల రక్తం తాగుతూ ఇంతగా పీడించుకుతినే వాళ్లను ఎక్కడా చూడలేదు. ఇలాంటోళ్లు రాజకీయాల్లో ఉండొద్దు. ప్రజలు ఆయనను ఓడించి మంచి పని చేశారు. నిజానికి ఇంకా దారుణంగా ఓడించాల్సింది” అని అన్నారు.
