బడుల్లో మత్తు వదలాల్సిందే..డ్రగ్స్, పొగాకు కట్టడికి సర్కార్ మూడేళ్ల యాక్షన్ ప్లాన్

బడుల్లో  మత్తు వదలాల్సిందే..డ్రగ్స్, పొగాకు కట్టడికి సర్కార్ మూడేళ్ల యాక్షన్ ప్లాన్
  • ‘నషా ముక్త్ విద్యాలయ’ పేరిట మూడేళ్ల యాక్షన్ ప్లాన్
  • ఆన్‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌లో నమోదుకు విద్యాశాఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టూడెంట్లు మత్తు కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ‘నషా ముక్త్ విద్యాలయ (మత్తు రహిత స్కూల్)’ పేరుతో మూడేళ్ల భారీ కార్యాచరణను (2026–2029) సిద్ధం చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రతి బడి తనను తాను పొగాకు, మాదకద్రవ్య రహిత సంస్థగా ప్రకటించుకోవడంతో పాటు దీనికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలి. దీనికి సంబంధించి డీఈఓలందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.

స్టేట్​లోని 42 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లు వెంటనే https://tofei.education.gov.in పోర్టల్‌‌‌‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ యుడైస్ కోడ్‌‌‌‌తో లాగిన్ అయ్యి, స్కూల్ తరపున ఒక నోడల్ ప్రతినిధిని నియమించాలి. స్కూళ్లలో మత్తు పదార్థాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ‘సెల్ఫ్ ఎవాల్యుయేషన్’ పూర్తి చేయాల్సి ఉంటుంది. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బోర్డులు, అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటో సాక్ష్యాలను అప్‌‌‌‌లోడ్ చేయడం తప్పనిసరి. 

500 మీటర్ల పరిధిలో నో డ్రగ్స్ జోన్.. 

యాక్షన్ ప్లాన్ ప్రకారం.. ప్రతి స్కూల్ చుట్టూ 500 మీటర్ల పరిధిని ‘డ్రగ్ ఫ్రీ జోన్’గా నిర్వహించాలి. బడి ఆవరణలో, బయట నిర్ణీత పరిధిలో మాదకద్రవ్యాల నిషేధాన్ని తెలుపుతూ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. స్కూళ్లలో క్రమం తప్పకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు లైఫ్ స్కిల్స్, కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి.