- ‘మొబైల్ మ్యూజియం ఆన్ వీల్స్’ పేరుతో ప్రత్యేక బస్సు ఏర్పాటు
- 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న స్పెషల్ బస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక వైభవాన్ని, బౌద్ద వారసత్వ సంపదను చాటిచెప్పేందుకు పర్యాటకశాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల విశిష్టత, ప్రత్యేక వంటకాలు, టూరిజం బ్రోచర్లు వంటి సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ‘మొబైల్ మ్యూజియం ఆన్ వీల్స్’ పేరుతో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి కలిసి బుద్ధవనంలో లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను వివరించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర సాగనుంది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం పరిధి దాటి పట్టణాలు, పల్లెలు, విద్యాసంస్థలకు బౌద్ధతత్వాన్ని తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ జలపాతాలు, హైదరాబాద్ చరిత్ర తెలిపే పుస్తకాలు, టూరిజం ప్రాజెక్టుల వివరాలు, టూర్ ప్యాకేజీల సమాచారం ఈ బస్సులో అందుబాటులో ఉంటుంది.
ఈ బస్సు ఒక జ్ఞాన గని..
ఈ బస్సు లోపల అడుగుపెడితే ఒక విజ్ఞాన గనిని తలపిస్తుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బ్రోచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రుచులకు సంబంధించిన పుస్తకాలు, చారిత్రక గ్రంథాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ - ఫ్యాసెట్స్ ఆఫ్ ఏ ఫాసినేటింగ్ సిటీ వంటి ఫొటో ఆల్బమ్స్ ద్వారా నగర వైభవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. కేవలం పుస్తకాలే కాకుండా, దృశ్యరూపంలో సమాచారం అందించేందుకు బస్సులో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు నిరంతరం ప్రదర్శితమవుతాయి. బుద్ధుడి విగ్రహాలు, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే ప్రదర్శన ప్యానెల్స్, ఆడియో- విజువల్ ప్రజెంటేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువత, విద్యార్థుల్లో శాంతి, అహింస, కరుణ వంటి బుద్ధుడి సందేశాలను వ్యాప్తి చేయడానికి ఇది ఒక ‘చలనశీల జ్ఞాన కేంద్రం’లా పని చేస్తుందని బౌద్ధ భిక్షువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఊరూరా ప్రచారం..
పర్యాటకశాఖ రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ బస్సు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది. ప్రతి పల్లెకు పర్యాటక సందేశాన్ని చేరవేయడంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా బౌద్ధ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, మారుమూల గ్రామాల్లో ఈ బస్సు పర్యటించడం వల్ల నేటి తరానికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని పర్యాటక శాఖ పేర్కొంది.
