హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హైకోర్టు జడ్జి నియామకాల్లో తెలంగాణ మూలాలు ఉన్న, ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే పరిగణనలోకి తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (టీహెచ్‌సీఏఏ) తీర్మానించింది. బుధవారం అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాజీ అధ్యక్షులతో కూడిన ప్రతినిధి బృందం సీజేఐను కలిసి తెలంగాణ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనుంది. సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ తెలంగాణకు చెందిన న్యాయవాదుల పేర్లనే హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేయనుంది. సమావేశంలో ఉపాధ్యక్షుడు డి.ఎల్. పాండు, కార్యదర్శులు పి. శ్రావణ్ కుమార్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
