గన్నేరువరం: సర్పంచ్ వేధిస్తున్నాడని.. పురుగు మందు, పెట్రోల్ డబ్బాతో ఆందోళన

గన్నేరువరం: సర్పంచ్ వేధిస్తున్నాడని.. పురుగు మందు, పెట్రోల్ డబ్బాతో ఆందోళన

గన్నేరువరం, వెలుగు: తమ భూమిని ప్రభుత్వ భూమి అంటూ సర్పంచ్, కార్యదర్శి, ఇద్దరు వార్డు మెంబర్లు వేధిస్తున్నారని కరీంనగర్  జిల్లా గన్నేరువరానికి చెందిన కుర్ర హరీశ్  బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ ఆఫీస్​ ఎదుట ఆందోళనకు దిగాడు. పురుగు మందు, పెట్రోల్  డబ్బాతో నిరసన తెలిపాడు. బాధితుడు మాట్లాడుతూ ఊరి చివరన ఉన్న 12 గుంటల్లో తాతల కాలం నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నామని తెలిపాడు. 

తమకు పట్టా డాక్యుమెంట్స్  ఉన్నప్పటికీ, సర్పంచ్  రంగనవేణి లచ్చినర్సు, కార్యదర్శి, ఇద్దరు వార్డు మెంబర్లు 3 గుంటల భూమిని వీవో బిల్డింగ్​కు ఇవ్వాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వేధింపులు ఆపకపోతే కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి వెంకటరెడ్డిని వివరణ కోరగా, కుర్ర హరీశ్​ పర్మిషన్ లేకుండా కాంపౌండ్  వాల్​ నిర్మిస్తున్నాడని  ఫిర్యాదు రావడంతో అడ్డుకున్నామని తెలిపారు. వీవో బిల్డింగ్​కు భూమి ఇవ్వాలని తాను డిమాండ్​ చేయలేదన్నారు.