బషీర్బాగ్, వెలుగు: లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (లిడ్ కాప్)ను పునరుద్ధరించాలని తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ డిమాండ్ చేసింది. సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి, ప్రధాన కార్యదర్శి ములుగు రాజు మాట్లాడుతూ.. లిడ్ కాప్ భూములను అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లిడ్కాప్ కు రూ.12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. గత ప్రభుత్వం లిడ్ కాప్ భూములను అన్యాక్రాంతం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీ సలహాదారు డా. ఆరెపల్లి రాజేందర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సొసైటీ ఉపాధ్యక్షుడు రవీందర్, చిట్యాల మొగిలి పాల్గొన్నారు.
