వర్సిటీల బిల్లుకు మండలి ఆమోదం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

వర్సిటీల బిల్లుకు మండలి ఆమోదం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సభ్యుల చర్చ, సూచనల అనంతరం బిల్లును మండలి ఆమోదించింది.ఈ సందర్భంగా మండలికి యూనివర్సిటీ వివరాలను మంత్రి దామోదర వివరించారు. రూ.500 కోట్లతో యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 310 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వర్సిటీ విస్తరణ ఉంటుందన్నారు. 

చర్చలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి (ఆటానమీ) కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. రీసెర్చ్ కార్యక్రమాల కోసం ఫండ్స్ ఎక్కువగా కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ ఏర్పాటును ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు.

20 కాలేజీల్లోనే సరైన సౌకర్యాలు: విజయశాంతి

రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కేవలం 20 మాత్రమే సరైన సౌకర్యాలు కలిగి ఉన్నాయని, మిగతా కాలేజీల్లో సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించకపోయినప్పటికీ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, వాటి వివరాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం శాసన మండలిలో క్వశ్చన్ అవర్‌లో భాగంగా విజయశాంతి మాట్లాడారు. సౌకర్యాలు లేని కాలేజీలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. వీడీసీల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్లలో వస్తున్న వార్తలను కోర్టులు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ..ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఖిలా వరంగల్‌కు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.