
- జెండా ఎగరేయనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్
- కంటోన్మెంట్ పార్కులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
- వేడుకల కోసం బీజేపీ సన్నాహక సమావేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
శనివారం (సెప్టెంబర్ 06) హైదరాబాద్ బర్కత్‌పురలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ తదితరులు ఈ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాటు, భద్రత, కార్యక్రమ ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
ఈ వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, మహారాష్ట్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించనున్నారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుల పోరాట గాథలు, ఉద్యమ కథలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.