అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా

అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు.  అంతకుముందు  అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా... సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.   హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్‌ 17న  అప్పటి హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించగా.... ప్రస్తుతం  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. 12 ట్రూపులకు చెందిన 1300 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇందులో 8 ట్రూపులు తెలంగాణ, 2 ట్రూపులు మహారాష్ట్ర, మరో 2 ట్రూపులు కర్ణాటక నుంచి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రాంతానికి చెందిన కళలు, సంస్కృతి తెలిపేలా ప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించారు.