లాటరీ విధానంలో లిక్కర్ షాపులు: కొత్త పాలసీ ప్రకటన

లాటరీ విధానంలో లిక్కర్ షాపులు: కొత్త పాలసీ ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019 నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు కొత్త విధానం అమలులో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.

వీటికి దరఖాస్తు చేసుకునే వాళ్లు 2 లక్షల రూపాయల నాన్ రిటర్నబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది. గతంలో రూ.1 లక్ష ఉన్న ఈ ఫీజును రెట్టింపు చేసింది. షాపులకు దరఖాస్తులు చేసుకున్న వారికి లాటరీ విధానంలో లిక్కర్ లైసెన్సులు ఇస్తారు. ఈ నెలాఖరు లోపు షాపులను కేటాయింపు పూర్తవుతుంది. వచ్చే నెల 1 నుంచి 2021 అక్టోబరు చివరి వరకు లైసెన్స్ గడువు ఉంటుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 వరకు

జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లిక్కర్ షాపులు తెరిచి ఉంటాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన గతంలో అమలులో ఉన్న 4 స్లాబ్ లను 6 స్లాబ్ లకు పెంచింది ప్రభుత్వం.