
- ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ..తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు
- వారంలోగా రైతు భరోసా నిధులు
- పంద్రాగస్టులోగా అన్ని భూ సమస్యలు క్లియర్
- 7,578 గ్రామాల్లో భూ సమస్యలపై 4.61 లక్షల అప్లికేషన్లు వచ్చాయని వెల్లడి
ఖమ్మం/హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థలకు ఈనెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘‘ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లుంటాయి. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి. సోమవారం కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు కూసుమంచిలోని క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘స్థానిక ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని, ఎన్నికలకు సిద్ధం కావాలి. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించుకోవడం మాత్రమే కాదు.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది” అని స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని.. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా సప్లై చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వాళ్ల స్వార్థం కోసం ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేస్తే, వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తున్నామని తెలిపారు. ‘‘ఆ భగవంతుని దయతో ఈ సంవత్సరం పదిహేను రోజుల ముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయి.
వ్యవసాయ సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చాం. వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ కుంట మొదలుకొని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ చేస్తాం. సన్నాలకు బోనస్ డబ్బులు కూడా ఖాతాల్లో వేస్తాం” అని వెల్లడించారు. వరి వేస్తే ఉరి అని ఆనాటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే.. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయిన తర్వాత కూడా దేశంలో ధాన్యం పండించిన రాష్ట్రంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తున్నదన్నారు.
4.61 లక్షల దరఖాస్తులు
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల పురోగతిపై ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 561 మండలాల్లోని 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. 4.61 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. ఈ సదస్సులు ఈ నెల 20 వరకు కొనసాగుతాయని తెలిపారు. భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా, రైతులకు మేలు చేసేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, మానవతా దృక్పథంతో వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
‘‘దాదాపు రెండు నెలలుగా భూ భారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో సుమారు 50 ప్రాంతాల్లో నేను స్వయంగా పాల్గొన్నాను. ఆ సదస్సుల్లో రైతులు తమ గోసను చెప్పుకుంటుంటే నాకు ఎంతో బాధ కలిగింది. గత సర్కారులో సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ధరణి కారణంగా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయింది. ప్రతిదానికీ కోర్టు మెట్లు ఎక్కడమే తప్ప రైతుకు మరో దారి లేకుండా పోయింది” అని అన్నారు. రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూసర్వే శరవేగంగా సాగుతున్నదని చెప్పారు. ‘‘గత ప్రభుత్వం 413 నక్షా గ్రామాలను గాలికోదిలేస్తే, మా ప్రభుత్వం వాటికి పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే చేపట్టింది. గత నెల మూడో వారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో సర్వేను ప్రారంభించాం.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్లో 422 ఎకరాలకు 337 ఎకరాల్లో సర్వే పూర్తయింది. జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది)లో 626 ఎకరాలకు 269 ఎకరాలు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలో 845 ఎకరాలకు 445 ఎకరాలు.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలకు 232 ఎకరాలు.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్లో 593 ఎకరాలకు 308 ఎకరాలు.. మొత్తం ఐదు గ్రామాల్లో 2,988 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1,591 ఎకరాల్లో సర్వే పూర్తయింది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. మరో వారం పదిరోజుల్లో సర్వే ప్రక్రియను మొత్తం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.