బై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే

బై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే

మామిడి పండ్ల సీజన్ ముగిసింది. వేసవికాలం జనాల నోరును తీపి చేసిన మ్యాంగోకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది.  సీజన్ ముగియడంతో  రంగారెడ్డి జిల్లా బాట సింగారం హయత్ నగర్ పండ్ల మార్కెట్ కు మామిడి కాయల రాక తగ్గింది. త్వరలో మామిడిపండ్ల ప్రధాన మార్కెట్ గా పేరుగాంచిన  మోజామ్ జాహీ మార్కెట్, పహాడీ షరీఫ్, గుడిమల్కాపూర్ లోని మార్కెట్లకు కూడా మామిడి కాయల రాక తగ్గనుంది. దీంతో మామిడిపండ్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. 

మామిడి పండ్ల సీజన్ మొదలు కాగానే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వివిధ రకాల పచ్చి కాయలు హైదరాబాద్ లోని పండ్ల మార్కెట్లోకి దిగుమతి అవుతుంటాయి. అలాగే తెలంగాణలోని రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి కూడా నగరానికి మామిడి కాయలను రైతులు సరఫరా చేస్తారు. ప్రస్తుతం సీజన్ ముగియడంతో మార్కెట్‌కు దాదాపు 60 శాతం మేర మామిడికాయల రాక తగ్గిందని, ఈ నెలాఖరు నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని పండ్ల మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం మామిడి సీజన్ ముగిసిన నేపథ్యంలో  రిటైల్ మార్కెట్‌లో  బంగినపల్లి మామిడి పండ్లు  కిలో  రూ. 50,   హిమాయత్ రకం కిలో - రూ. 100,  రసాలు కిలో - రూ. 80,  అల్ఫోన్సో రకం  - రూ. 350,  దాసెరి కిలో  - రూ. 80,  మలేక   రకం కిలో - రూ. 80 గా పలుకుతున్నాయి. అయితే ప్రస్తుతం మామిడికాయల రాక తగ్గడంతో రానున్న రోజుల్లో ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. 

సాధారణంగా మామిడి సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభమై జూన్ చివరి వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు పండ్ల రాకను బట్టి జూలై మధ్య వరకు సీజన్ ఉంటుంది. కానీ ఈ ఏడాది జనవరి నుంచే మార్కెట్‌కు  మామిడి కాయల రాక మొదలైంది.  నగరంలోని పండ్ల మార్కెట్‌లకు సగటున 600 ట్రక్కుల  మామిడి పండ్లు దిగుమతి అయ్యాయి. ఈ పచ్చి మామిడి పండ్లను ప్రధాన వ్యాపారులు రిటైల్ మార్కెట్లో చిన్నవ్యాపారులకు  విక్రయించారు.  మార్చిలో మామిడిపండ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో అధిక ధరలు పలికాయి. కానీ ఏప్రిల్ మొదటి వారంలో ధరలు తగ్గాయి. 
ఏప్రిల్ ప్రారంభంలో కిలో బంగినపల్లి మామిడి ధర రూ. 100 ఉంటే ప్రస్తుతం బంగినపల్లిమామిడి పండ్ల ధర కిలో రూ. 50గా పలుకుతోంది.