అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. 132 మందిని ఎంపిక చేసిన.. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు

అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. 132 మందిని ఎంపిక చేసిన.. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
  •     నేడో, రేపో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల తుది ఫలితాలు
  •     7న రవీంద్రభారతిలో నియామక పత్రాల అందజేత!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరింది. నాలుగు ప్రధాన స్పెషాలిటీలు గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ సంబంధించి ఎంపికైన 132 మంది అభ్యర్థుల తుది జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శనివారం విడుదల చేసింది. 

ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ ప్రాతిపదికన వీరిని ప్రాథమికంగా ఎంపిక చేశారు. మొత్తం 174 పోస్టుల ఫలితాలను బోర్డు ప్రాసెస్ చేయగా.. గైనకాలజీలో 65, అనస్థీషియాలో 37, పీడియాట్రిక్స్ లో 23, ఆర్థోపెడిక్స్ లో 7 మంది డాక్టర్లు ఎంపికయ్యారు. అయితే, అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఓహెచ్, కొన్ని రిజర్వ్‌‌‌‌డ్ కేటగిరీలకు చెందిన 42 పోస్టులు ఖాళీగా మిగిలాయి. వీటిని తర్వాతి నోటిఫికేషన్‌‌‌‌ కు క్యారీ ఫార్వర్డ్ చేయనున్నారు.

7న నియామక పత్రాలు... 

మరోవైపు, 697 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల ఫలితాలు కూడా నేడో,  రేపో వెల్లడికానున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిజల్ట్స్ కూడా మరో వారం పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయనున్నారు. కాగా, గత రెండున్నరేండ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో 9,572 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. తాజా నియామకాలతో ఈ సంఖ్య 12,755కు చేరనుంది.