- ప్రభుత్వ చొరవతో పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి
- ఏప్రిల్ 21 నుంచి ఇప్పటివరకు 7 పట్టణాల్లో జాబ్ మేళాలు
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సహకారంతో ప్రముఖ ప్రైవేటు కంపెనీలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చి మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. సింగరేణి కాలరీస్ సౌజన్యంతో నిర్వహించిన ఈ మేళాలతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి 7 పట్టణాల్లో జాబ్ మేళాలు నిర్వహించగా 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. వీరిలో 23,650 మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభించాయి. 7వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, టెక్నికల్, మెడికల్ అర్హతలకు తగినట్టుగా యువత ఉద్యోగాలను పొందారు.
ప్రతి మేళాలో 100 నుంచి -250 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వీటికి వేలాది మంది తరలి రాగా సింగరేణి ఆధ్వర్యంలో స్టాల్స్, భోజనం, భద్రత ఏర్పాట్లు కల్పించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జాబ్ మేళాలల్లో పెద్ద సంఖ్యలో యువత ఉద్యోగాలు పొందారు. భవిష్యత్తులో కొత్తగూడెం, మణుగూరు మొదలైన ప్రాంతాల్లో మరిన్ని మేళాలు నిర్వహించడానికి ప్రభుత్వానికి సహకారం అందిస్తామని సింగరేణి సీఎండీ బలరామ్ వెల్లడించారు.
