
- రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఈజీఎస్ సిబ్బంది
- రెండుసార్లు ఆర్డీ కమిషనర్ ఆఫీసు ముట్టడి
- డైరెక్టర్ హామీతో విధుల్లోకి.. కొందరినే తీసుకుంటామనడంతో మళ్లీ సమ్మె బాట
హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్(ఎంఎన్ఆర్ఈజీఎస్) అమలులో జరిగే అవకతవకలను వెలికితీసేందుకు గ్రామాల్లో చేసే సోషల్ ఆడిట్ 2 నెలలుగా నిలిచిపోయింది. పలు డిమాండ్లతో ఉపాధిహామీ సిబ్బంది రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జులై 7న సమ్మె నోటీసు ఇచ్చిన సిబ్బంది అదే నెల15 నుంచి సమ్మెలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఈజీఎస్ పనులపై తనిఖీలు జరగడం లేదు.
ఐడీ కార్డులు కూడా ఇయ్యలె
ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అవకతవకలను అరికట్టేందుకు మొత్తం ఈజీఎస్ బడ్జెట్‌లో 0.5 శాతాన్ని సోషల్ ఆడిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. సోషల్ ఆడిట్ బాధ్యతలను సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబులిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ(ఎస్ఎస్ఏఏటీ) సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 48 మంది డీఆర్‌పీలు, 438 మంది బీఆర్‌పీలు 2007 నుంచి ఈ సంస్థలో పని చేస్తున్నారు. నెలలో 23 రోజులు కుటుంబానికి దూరంగా ఏదో ఒక గ్రామంలో విధులు నిర్వహించే వీరు క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి కనీస వేతన చట్టం అమలు కాలేదు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లేవు. కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవు. దీంతో వీరంతా ఆందోళన బాట పట్టారు.
మళ్లీ సమ్మె బాట
జులై 15 నుంచి విధులకు దూరంగా ఉంటూ సమ్మె చేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో అదే నెల 27, 28న దీక్షలకు దిగారు. ఎస్ఎస్ఏఏటీ డైరెక్టర్ దిగిరాకపోవడంతో ఆగస్టు 29న రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జనరల్ బాడీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఈ నెల 4న విధుల్లో చేరేందుకు అంగీకరించారు. 4న విధుల్లో చేరేందుకు రాగా 3 నెలల కాంట్రాక్ట్ ఉన్న వారిని తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. అందరినీ బేషరతుగా డ్యూటీలోకి తీసుకోవాలని, లేదంటే ఎవ్వరూ చేరబోమని తెగేసి చెప్పి సమ్మె కొనసాగిస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. డైరెక్టర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
డిమాండ్లు ఇవే..
వీఎస్‌ఏల గౌరవ వేతనం పెంచాలి. వీఎస్‌ఏ, బీఆర్‌పీ, డీఆర్‌పీలకు రోజు డీఏ రూ.250 ఇవ్వాలి. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు బీఆర్‌పీ, డీఆర్‌పీలు 24 గంటలు డ్యూటీలో ఉంటున్న దృష్ట్యా 15 రోజులు పని చేస్తే 15 రోజులు రెస్ట్ ఇవ్వాలి. 1న జీతాలివ్వాలి. బీపీఎస్, డీఆర్‌పీలపై వచ్చే అభియోగాలపై కమిటీ వేయాలి. మహిళా సిబ్బందికి ప్రెగ్నెన్సీ సమయంలో 3 నెలలు, డెలివరీ తర్వాత ఆరు నెలలు ఆఫీస్ వర్క్ కల్పించాలి. నో వర్క్.. నో పే విధానం రద్దు చేయాలి.