
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని విమర్శించారు. బీజేపీ వాళ్లకు పౌరుషం లేదా.. బానిసలుగా ఉన్నారా అని పొన్నం మండిపడ్డారు. బీజేపీ నేతలకు తెలంగాణ రక్తం ఉందా? లేదా? అని అసెంబ్లీలో పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు మాట్లాడే అవకాశమే లేదని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించారని, తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారని కామెంట్ చేశారని మంత్రి పొన్నం గుర్తుచేశారు.
మోదీకి తెలంగాణ అంటే వివక్ష ఎందుకని ప్రశ్నించారు. నిజాలు చెబితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని పొన్నం నిలదీశారు. మూసీ అంటే అవినీతి అంటున్నారని, సబర్మతిలో అవినీతి లేదా అని సూటిగా ప్రశ్నించారు. అక్షింతలు పంచి, మతం పేరుపై 8 సీట్లు గెలిచారని పొన్నం విమర్శించారు. పదేళ్లు కేంద్రంతో కొట్లాడమన్న బీఆర్ఎస్ అన్ని బిల్లులకు మద్దతిచ్చిందని, 7 మండలాలు ఏపీలో కలిపితే బీఆర్ఎస్ ఏం చేసిందని పొన్నం నిలదీశారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే మంత్రి అవుతానని అనుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.