పది ఫలితాలు వెల్లడి.. రిజల్ట్స్ కోసం ఈ వెబ్‌సైట్‌లు చూడండి

పది ఫలితాలు వెల్లడి.. రిజల్ట్స్ కోసం ఈ వెబ్‌సైట్‌లు చూడండి

హైదరాబాద్: కరోనా ఉధృతితో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో విద్యార్థులు అందరినీ పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రతి విద్యార్థినీ పాస్ చేశామన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని.. ఇది కేసీఆర్ కు విద్యా రంగం మీద ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5, 21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. 4,495 మంది గతంలో ఫెయిలై పరీక్ష ఫీజు చెల్లించినవారన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా.. 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారని చెప్పారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలను www.bse.telangana.gov.in తోపాటు http.//results.BSETELANGANA.ORG వెబ్ సైట్ ల్లో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చని సబిత పేర్కొన్నారు. విద్యార్థులు తమ పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్ సీ బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దుతామని పేర్కొన్నారు.