
- గత సర్కారు చేసిన అప్పులతో ఇబ్బంది పడుతున్నాం
- ఇంటర్నేషనల్ వాటర్ వీక్సదస్సులో పాల్గొన్న మంత్రి
- సమ్మక్క ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం చత్తీస్‌గఢ్ మంత్రితో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అప్పులపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా ఈ అప్పులను క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగా నైనా మాఫీ చేసేందుకు సహకరించాలని కోరారు.
మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు–2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కార్యక్రమంలో 40 దేశాల ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవోల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ పాల్గొన్నారు. నాలుగు రోజులు సాగనున్న ఈ సదస్సులో రాష్ట్రం నుంచి మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.
ఏటా 6 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లను ఇరిగేషన్ కు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి కూడా సహకారం కావాలన్నారు. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం లక్షల కోట్లు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించిందని.. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా అదే స్థాయిలో నిధులు కేటాయించాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా చొరవ తీసుకోవాలన్నారు.
సమ్మక్క ప్రాజెక్టుకు సహకరించండి..
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమ్మక్క- సారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంలో సహకరించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం చత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో ఉన్నందున దీన్ని పూర్తి చేయడానికి, కేంద్రం నుంచి క్లియరెన్సులు రావడానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉందన్నారు.
వాటర్ వీక్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చత్తీస్‌గఢ్ ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో ప్రత్యేకంగా భేటీ అయి ఈ అంశంపై చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. కేంద్రం కూడా చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని క్లియరెన్సులు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో కూడా ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్ ఇవ్వాల్సిందిగా వారిని కోరారు.