బీసీ రిజర్వేషన్లపై 3 ప్రపోజల్స్..పీసీసీకి మంత్రుల కమిటీ నివేదిక

బీసీ రిజర్వేషన్లపై 3 ప్రపోజల్స్..పీసీసీకి మంత్రుల కమిటీ నివేదిక
  • సీఎంతో మీనాక్షి, మహేశ్ గౌడ్ చర్చ 
  • 30న జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ 

హైదరాబాద్, వెలుగు: లోకల్​బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మంత్రుల కమిటీ మూడు ప్రతిపాదనలు చేసింది. మొదట బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని, అది కుదరకపోతే ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్ల అమలు చేయాలని, దీన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 23న పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో చర్చించి.. న్యాయ నిపుణులతో సంప్రదింపుల కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. 

డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరితో ఏర్పాటైన ఈ కమిటీ..  మూడుసార్లు సమావేశమై న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరిపింది. బుధవారం గాంధీభవన్‌లో సమావేశమైన కమిటీ.. న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు తుది నివేదికను సిద్ధం చేసింది. ఆ వెంటనే దాన్ని పార్టీ స్టేట్ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు అందజేసింది. ఆ రిపోర్టును గురువారం సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి, మహేశ్ గౌడ్ అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంట్లో దాదాపు గంటన్నరకు పైగా ఆయనతో చర్చించారు.   

30న క్లారిటీ.. 

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు అమలుకు సంబంధించి మూడు మార్గాలను మంత్రుల కమిటీ సూచించినట్టు తెలిసింది. ఇందులో మొదటిది పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా కోరడంతో.. ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. 

ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ బిల్లులు ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం వేచి చూసి, అనంతరం న్యాయపరమైన పోరాటం చేయాలని కమిటీ సూచించింది. కానీ ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. ఇప్పటికే సెప్టెంబర్​30లోగా లోకల్​బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో.. మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలను కమిటీ సూచించింది.

 లోకల్​బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రత్యేక జీవో విడుదల చేయాలని.. ఒకవేళ ఎవరైనా కోర్టును ఆశ్రయించి, కోర్టు గనుక ఆ జీవోను కొట్టివేస్తే, ఆ వెంటనే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. పార్టీ పరంగా అమలు అనేది పూర్తిగా పీసీసీ చేతిలో ఉంటుంది. ఇప్పటికే పీఏసీ మీటింగ్‌లో పార్టీ పరంగా బీసీలకు  42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 30న అసెంబ్లీ వేదికగా జరగనున్న కేబినెట్​భేటీలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.