
- సర్కారుకు త్వరలోనే విద్యాశాఖ ప్రపోజల్
- గురుకులాల తరహాలో మోడల్ స్కూళ్లు నడిపేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐదో తరగతిని ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గురుకులాల తరహాలోనే అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లున్నాయి.
వీటిలో ఇంగ్లిష్ మీడియంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఆరో తరగతికి ఎంట్రెన్స్ నిర్వహించి, అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రతి స్కూల్లో ఒక్కో సెక్షన్లో 50 సీట్ల చొప్పున రెండు సెక్షన్లలో వంద సీట్లను భర్తీ చేస్తున్నారు. ఈ లెక్కన మోడల్ స్కూళ్లలో 1.94 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, గత కొంతకాలంగా ఆరో తరగతిలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. గతేడాది ఆరో తరగతిలో 1.12 లక్షల అడ్మిషన్లు అయితే, ఈ ఏడాది 1.08 లక్షలకు పడిపోయింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు.
గురుకుల తరహాలో..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల స్కూళ్లన్నీ 5వ తరగతి నుంచే నడుస్తున్నాయి. దీంతో పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైమరీ లెవెల్నుంచే ఉచితంగా క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం విద్యను చదువుతున్నారు. అయితే, మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి నుంచే అడ్మిషన్లు అవుతున్నాయి. దీంతో గురుకులాల్లో ఐదో తరగతిలో చేరిన విద్యార్థులు.. ఆరో తరగతి కోసం మోడల్ స్కూళ్ల వైపు రావడం లేదు. దీంతో మోడల్ స్కూళ్లకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో మోడల్ స్కూళ్లను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఐదో తరగతి నుంచే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభించాలని యోచిస్తున్నారు. సర్కారు అనుమతి ఇస్తే వచ్చే ఏడాది నుంచి ఒక్కో స్కూల్లో 40 మందితో ఐదో తరగతి క్లాసులు ప్రారంభించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.