పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిలరాగాలు, గలగల పారే నీటి సవ్వడి.. వీటన్నిటి కేరాఫ్ పాకాల చెరువు. కాకతీయుల ఘన చరిత్రకు నిదర్శనం ఇది.. వంద చెరువులకు సమానం. అపారమైన జంతు సంపద, అమూల్యమైన ఔషధాలు ఇక్కడి అడవుల సొంతం.. అదెక్కడో కాదు.. మన తెలంగాణలోనే.. ఇప్పుడు ఆ పర్యాటక ప్రాంతం గురించి తెలుసుకుందాం. . . !
పాకాల సరస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా సర్వం పేటలోని ఖానాపురం మండలంలో ఉంది. ఇది సరస్సు అయినా అందరూ దీనిని పాకాల చెరువు అనే పిలుస్తారు. చుట్టూ ఉన్న అడవులు పర్యాట కులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. చిలుకల గట్లు.. చెరువు చుట్టూ ఉన్న ఎత్తైన గుట్టలు ప్రకృతి ప్రేమి కులను ఆకట్టుకుంటున్నాయి..
వంద చెరువులకు సమానం
ఈ చెరువు కాకతీయుల ఘన చరిత్రకు ప్రతిరూ పంగా నిలుస్తోంది. రెండో ప్రతాపరుద్రుడి ముని మనవడు మూడో గణపతి దేవ చక్రవర్తి 1213లో దీనిని తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది. చెరువుకు 3,200 ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు చెప్తున్నారు.
చెరువులో నీళ్లు 32అడుగులకు చేరితే మత్తడి పొంగుతుంది. ఇంత వరకు ఈ చెరువు ఎప్పుడూ ఎండిపోలేదు దీని ద్వారా 40 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. ఒక్కసారి చెరువు పూర్తిగా నిండితే ఆ నీళ్లు రెండు పంటలకు సరిపోతాయి.
నర్సంపేట పట్టణానికి తాగునీరు కూడా ఈ చెరువు నుంచే సరఫరా అవుతుంది. అందుకే దీనిని వంద చెరువులకు సమానం అని అక్కడివా ళ్లు చెప్పుంటారు. చెరువుకు జాలు బంధం ,తుంగ బంధం, మాటు వీచారం, పసునూరు, సంగెం అనే ఐదు కాల్వలు ఉన్నాయి. ఈ కాల్వలకుతూముల ద్వారా నీళ్లు వదులుతారు.
హాయిగా బోటింగ్ చెయ్యొచ్చు
పాకాల సరస్సులో బోటింగ్ చేసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుం టారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం హరిత హోటలు కూడా ఏర్పాటు చేసింది. కాలుష్యాన్ని నివారించేందుకు బైకులు, కార్లను చెరువు ప్రాంగణంలోకి అనుమతించడంలేదు. అభయారణ్యంలో తిరగడానికి బ్యాటరీతో ఆటోలు, సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలోని పర్యావరణ కాలుష్య రహిత సరస్సుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది పాకాల. దేశంలో రెండో స్థానం దక్కింది. చెరువు కాల్వల నుంచి స్వచ్ఛమైన నీళ్లు పారుతుండడంతో ఇక్కడికొచ్చే పర్యాటకులు ఈత కొట్టేందుకు బాగా ఇష్టపడతారు. చెరువు తూముపై ఏర్పాటు చేసిన నాగలి సెల్ఫీస్పాట్ గా మారింది. పర్యాటకులు ఇక్కడ పోటీపడి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. చెరువు అందాలను చూసేందుకు విదేశాల నుంచికూడా పర్యాటకులు వచ్చిపోతుంటారు.
జంతు సంపద అపారం
ఈ చెరువు చుట్టు పక్కల ఉండే గుట్టలు. అడవు ల్లో అనేక రకాల జంతువులుంటాయి. అక్కడికి వెళ్లగానే కోతులు, కొండెంగలు గంతులేస్తూ కని పిస్తుంటాయి. దుప్పులు, కుందేళ్లు, కొండగొర్రెలు మరెన్నో జంతువులు ఈ అడవుల్లో ఉంటాయి. అక్కడక్కడ నెమళ్లు కూడా కనిపిస్తుంటాయి.
రాత్రిళ్లు పులులు సంచరిస్తాయి. అందుకే చీకటి పడితే అటువైపు ఎవరూ వెళ్లరు. చెరువులో మొసళ్లు ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ వాటి వల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు స్థానికులు చెప్తున్నారు. ఈ అడవుల్లో ఔషధ సంపద కూడా బాగానే ఉంది రెండున్నర ఎకరాల్లో ఔషధగుణాలు కలిగిన 102 రకాల మొక్కలను అటవీ శాఖఅధికారులు పెంచుతున్నారు. జంతువులను కాపాడేందుకు ప్రత్యేక పార్కు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పక్షులకు ఆహారాన్ని కూడ అందిస్తున్నారు.
