పైసా&పవర్..ఆ రెండిటి చుట్టే మున్సిపోల్ పాలిటిక్స్

పైసా&పవర్..ఆ రెండిటి చుట్టే మున్సిపోల్ పాలిటిక్స్

హైదరాబాద్, వెలుగు: డబ్బు, అధికారం అండ ఉంటే తప్ప ప్రజాప్రతినిధిగా పోటీ చేసే స్కోప్ లేదని తాజా మున్సిపల్ ఎన్నికల తతంగం చూస్తే అర్థమవుతోంది. కనీసం వార్డు స్థాయి లోకల్ ఎన్నికల్లో పోటీకి దిగడం సాధ్యం కాదని తేలిపోయింది. ఓటర్ల జాబితా తయారీ వ్యవహారం మొదలు నామినేషన్​ దాఖలు చేసేవరకూ, ఆ తర్వాత  పోటీలో ఉంటే కుమ్మరించాల్సిన సొమ్ముల లెక్కల వరకు.. అంతటా పవర్  ప్రభావమే కనిపించింది. ఓటర్ల లిస్ట్ తయారు చేస్తున్నప్పుడే ప్రత్యర్థి ఓట్లు గల్లంతు చేయగల వ్యవస్థ, ప్రత్యర్థులకు చాన్స్​ ఇవ్వకుండా రిజర్వేషన్లు ఫైనల్ చేసుకోగల అవకాశం అధికారంలో ఉన్న పార్టీకే దక్కాయి. అడుగడుగునా డబ్బులు వెదజల్లితే తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. క్యాండిడేట్లు, వారి అనుచరులు బాజాప్త పోలింగ్​కేంద్రాల్లోనే డబ్బులు పంచడం.. ఓటర్లు కూడా వాటి కోసం క్యూ కట్టడం.. వంటి ఎన్నో సిత్రాలకు మున్సిపోల్స్​ వేదికయ్యాయి. వెరసి డబ్బుల్లేని లీడర్లు, మిడిల్​ క్లాస్​ ఉత్సాహవంతులు, సమాజానికి నిజాయితీగా సేవ చేయాలని ప్రయత్నించే వాళ్లకు  ఎన్నికల్లో నిలబడే చాన్స్​ లేకుండాపోయింది.

రిజర్వేషన్లలోనే ట్విస్టింగ్

చైర్​పర్సన్​, మేయర్​ పదవుల రిజర్వేషన్లను అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు అనుకూలంగా మార్చుకోవడం అలవాటుగా మారింది. గతంలో  రొటేషన్​ విధానంలో కోటాలను అమలు చేశారు. ఇప్పుడు కొత్త చట్టం ద్వారా రొటేషన్​ ఆర్డర్​ను మళ్లీ మొదటికి తెచ్చారు. ఐదేండ్లకోసారి రొటేషన్​ చేసే విధానాన్ని పదేండ్లకు మార్చారు. చైర్​పర్సన్లు, మేయర్లు మొదలు వార్డుల వరకు.. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చేలా అధికార పార్టీ జాగ్రత్త పడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో మంచి పేరుండి గెలిచే అవకాశం ఉన్న లీడర్లకు పోటీ చేసే అవకాశం దక్కలేదని అంటున్నాయి.

ఓటర్ల లిస్టులో కత్తెర

ఓటర్ల జాబితాలు, సవరణలో లెక్కలేనన్ని తప్పులు వెలుగుచూశాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు వార్డుల్లో ఏపీకి చెందిన ఓటర్ల పేర్లను చేర్చటం వివాదాస్పదమైంది.  ఒక వార్డులో ఇల్లుంటే.. మరో వార్డులో ఓట్లు, ఒకే కుటుంబంలో నలుగురుంటే.. ఇద్దరిని ఒకచోట.. ఇద్దరిని మరోచోట చేర్పించిన ఘటనలు కోకొల్లలు.  నిజాంపేట కార్పొరేషన్​ పరిధిలో పోలింగ్​ రోజున తమ ఓట్లు ఎక్కడున్నాయో.. ఏ పోలింగ్​ కేంద్రంలో ఓటేయాలో తెలియనంతగా ఓటర్ల లిస్టులను గజిబిజి చేసినట్లు క్యాండిడేట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పోలింగ్​ శాతం తగ్గింది. పోటీ చేసినా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

గజిబిజిగా వార్డుల విభజన

మున్సిపోల్స్​లో వార్డుల విభజన నుంచే పవర్​ పాలిటిక్స్​ నడిచాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ప్రత్యర్థులకు ఓటు బ్యాంకున్న వార్డులు, డివిజన్లను అధికార పార్టీ కల్లిబిల్లి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హద్దులు చెరిపేసి వార్డులు, డివిజన్ల విభజన జరిగింది. దీనిపై ఎన్నికలకు ముందే అన్ని పట్టణాల్లో వందలాదిగా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వార్డులు, డివిజన్ల విభజన సరిగ్గా జరగలేదని హైకోర్టులో ఏకంగా 67 టౌన్ల నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఆఖరి నిమిషంలో మార్పులేమీ చేయకుండానే ఎన్నికలకు రెడీ అయినట్లుగా ఫిర్యాదులున్నాయి.

క్యాష్​ లేదా కేస్ తో సైలెంట్

ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు రూ. లక్షల్లో డబ్బులు వెదజల్లడం ఈ ఎన్నికల్లో చాలాచోట్ల కనిపించింది. కొన్నిచోట్ల క్యాష్ తో వినకుంటే కేసులు పెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరంలో పోటీకి దిగిన క్యాండిడేట్లను విత్‌డ్రా చేయించేందుకు పోలీస్‌ పవర్‌ను ఉపయోగించారు. రాత్రి పూట కార్డన్‌ సెర్చ్‌ పేరుతో అభ్యర్థుల ఇండ్లకు వెళ్లి బెదిరించారు. రామకృష్ణాపూర్‌ మున్సిపాలిటీలోని ఓ వార్డులో పోటీకి దిగిన అభ్యర్థిపై మరో అభ్యర్థి ఠాణాలో కంప్లయింట్‌ చేశారు. దీంతో అతడ్ని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు అధికార పార్టీలో చేరాలంటూ ప్రెజర్‌ చేసి, అతను ఒకే చెప్పగానే రాత్రికి రాత్రే వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఓట్లకు నోట్లు కాదు కోట్లు

లోకల్​ బాడీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి ఓట్లకు రేటు పెరిగింది. మొత్తం మున్సిపోల్స్​ ఖర్చు వెయ్యి కోట్లు దాటిపోయింది. అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనుకాడలేదు. మున్సిపాలిటీల్లోని చిన్న వార్డుల్లోనూ రూ. 30 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెట్టారు. కార్పొరేషన్లలోని ఒక్కో డివిజన్​లో రూ. 3 కోట్ల నుంచి  5 కోట్ల దాకా వెదజల్లారు. ఆదిభట్ల వంటి ఏరియాల్లో ఒక్కో ఓటరుకు రూ. 10 వేల నుంచి 30 వేల వరకు పంచినట్లు తెలుస్తోంది. ఈ సారి ఓటర్లు సైతం నోట్లు, కానుకలను తీసుకునేందుకు క్యూ కట్టడం కొత్త ట్రెండ్. కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడ్డ నల్గొండ జిల్లా హాలియాలో కేవలం 12 వార్డుల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు రూ. 3కోట్లు దాటిందని అంచనా. ఐదేండ్ల కిందట హాలియా పంచాయతీగా ఉన్నప్పుడు ఎన్నికల ఖర్చు రూ. 30 లక్షలు దాటలేదని లోకల్​ లీడర్లు గుర్తుచేస్తున్నారు. కొందరు ఏకంగా డిజిటల్​ పేమెంట్​ ద్వారా ఓటర్ల ఖాతాల్లో జమ చేయగా.. ఇంకొందరు ఇంట్లో ఉన్న ఓట్లకు గంపగుత్తగా బంగారు కాయిన్లు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక్కో వార్డు కౌన్సిలర్‌ క్యాండిడేట్లు రూ. 15 వేల నుంచి 30 వేల వరకు ఓటర్లకు పంచిపెట్టారు. ఈసారి బాజప్తా అభ్యర్థులు నోట్లు పంచటం.. పోలింగ్​ కేంద్రాల వద్ద నగదు పంచుతున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరలయ్యాయి. గ్రేటర్​ శివారు మున్సిపాలిటీలు, నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో ఒక్కో ఓటుకు రూ. 25 వేలు పంపిణీ చేశారు. చండూరు మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులు 2.50 గ్రాముల బంగారు ఉంగరాలు చేయించి, రూ. 4 వేల నగదు కలిపి ఒక్కో ఓటరుకు ఇచ్చారు.

అడ్వాన్స్​ టికెట్లు.. క్యాంపులు

పార్టీ టికెట్​ అంత ఈజీ కాదు.. అన్నట్లుగా మున్సిపోల్స్ లో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు టికెట్లను బేరం పెట్టిన వీడియోలు, ఆడియోలు ఈసారి బయటపడ్డాయి. రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు, బడా బాబులే వీటిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. మరోవైపు పోలింగ్​ ముగియగానే.. ప్రధాన పార్టీలు మరోసారి పర్సులు ఒపెన్​ చేశాయి. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించటంతోపాటు ఇండిపెండెంట్లుగా  గెలిచేవాళ్లను కొనేందుకు సిద్ధమయ్యాయి.