- 2024లో 130 రకాల నాణ్యత లేని మందులు గుర్తింపు
- 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్
- జ్వరం, దగ్గు, గ్యాస్, యాంటీబయాటిక్ వంటి
- సాధారణ మెడిసిన్స్లోనే ఎక్కువ నాసిరకం
- డ్రగ్స్ కంటెంట్ తగ్గించి, తప్పుడు లేబుళ్లతో మార్కెట్లోకి
- ఈ మందులతో కిడ్నీలు, లివర్‌పై తీవ్ర ప్రభావం
- వ్యాధి నయం కాకపోగా కొత్త రోగాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాసిరకం మందుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నది. అనారోగ్యానికి గురైనప్పుడు మనం వేసుకునే మందులు నాణ్యమైనవా, ఉత్త సుద్ద బిల్లలా తెలియని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మనం రెగ్యులర్‌గా వేసుకునే జ్వరం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, గ్యాస్, అల్సర్, దగ్గు మందులే నాసిరకంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) చేసిన ర్యాండమ్ టెస్టుల్లో ఈ విషయం బయటపడింది.
డీసీఏం డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు రెగ్యులర్‌గా రిస్క్ బేస్డ్ విధానంలో ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులు, ప్రభుత్వ ఫార్మసీలను తనిఖీ చేస్తుంటారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన మందుల శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం స్టేట్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఇలా పంపిన శాంపిల్స్ టెస్టుల్లో కొన్ని మందులు నాణ్యత లోపంతో (నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ -– ఎన్ఎస్క్యూ) వస్తున్నట్లు తేలింది. 2022లో కేవలం 15గా ఉన్న నాణ్యతలేని మందుల సంఖ్య.. 2024 నాటికి ఏకంగా 130కి పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం
చేసుకోవచ్చు.
గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనూ...
ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనే కాకుండా, పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్స్‌కూ నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్నాయని తేలింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ కు మందులను సేకరిస్తారు. అయితే, ఇక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
సరఫరాకు ముందు మందులను పరీక్షించినా, గత తొమ్మిది నెలల్లో... తగిన మోతాదు లేని మందు ఒకటి, డిస్క్రిప్షన్ లోపం ఉన్నవి 2, డిసొల్యూషన్ 6, లేబుల్ వయలేషన్ మందులు 2 ఉన్నట్లు డీసీఏ ల్యాబ్ టెస్టుల్లో తేలింది. తగిన మోతాదులో మందును సరాఫరా చేయని... అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ తయారు చేసిన ఫార్మా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 88 క్వాలిటీలేని మందులను గుర్తించారు. అంటే... రెండేళ్లలోనే నాసిరకం మందుల బెడద పది రెట్లు పెరిగింది.
నాసిరకం మందులు 3శాతం పైనే..
గడిచిన కొన్నేండ్లుగా డీసీఏ అధికారులు మార్కెట్లో సేకరిస్తున్న శాంపిళ్లలో నాణ్యత లేనివిగా తేలుతున్న మందుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తున్నది. డీసీఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022లో 2,780 శాంపిళ్లను టెస్టులు చేయగా, కేవలం 15 మందులు (0.53%) మాత్రమే నాణ్యత లేనివిగా తేలాయి. కానీ 2023లో రిస్క్ బేస్డ్ శాంపిలింగ్ విధానాన్ని అనుసరించి 4,553 శాంపిళ్లను టెస్టు చేయగా, ఆ సంఖ్య ఏకంగా 79కి (1.73%) పెరిగింది. ఇక 2024లో పరిస్థితి మరింత దిగజారింది. ఈసారి 3,902 శాంపిల్స్ ను టెస్టులు చేయగా 130(3.33%) మందులు నాసిరకం ఉన్నట్లు తేలడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏకంగా 88 మందులు నాసిరకంగా తేలింది.
ఏయే మందులు ఫెయిల్ అవుతున్నాయంటే...
ప్రజలు ఎక్కువగా వాడే మందులే క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. యాంటీబయాటిక్స్, జ్వరం- పెయిన్ కిల్లర్స్, గ్యాస్ -అల్సర్ మందులు, దగ్గు సిరప్ లు, విటమిన్ టాబ్లెట్లు నాసిరకం మందుల లిస్ట్ లో ఉన్నాయి. యాంటీబయాటిక్స్ కు సంబంధించి అమాక్సిసిలిన్, సెఫిక్సైమ్, నార్ఫ్లోక్సాసిన్, పెయిన్ కిల్లర్స్ మందులు అయిన ఎసిక్లోఫెనాక్, పారాసెటమాల్, డైక్లోఫెనాక్ కాంబినేషన్ ట్యాబ్లెట్లు.
యాంటి యాసిడ్లు గా భావించే పాంటోప్రజోల్, రాబె ప్రజోల్ వంటి గ్యాస్ తగ్గించే మందులు. యాంటీ- అలర్జిక్ మందులైన సెటిరిజైన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, అల్బెండజోల్ (నులిపురుగుల మందు)లు నాసిరకంగా తేలిన మందుల లిస్టులో ఉన్నాయి. కొన్ని రకాల మందులను సరైన టెంపరేచర్ లో నిల్వ చేయకపోవడం, ఫార్మాకంపెనీలలో రా మెటీరియల్ లో జరిగిన తప్పిదాలు, కొన్ని బ్యాచ్ లు నాణ్యత లోపానికి కారణం అవుతాయని అధికారులు
చెబుతున్నారు.
డీసీఏను వేధిస్తున్న సిబ్బంది కొరత...
డీసీఏ స్టేట్ ల్యాబులో... సిబ్బంది కొరత వేధిస్తున్నది. మొత్తం ఆరుగురు అనలిస్టులు ఉండాల్సిన చోట ప్రస్తుతం నలుగురే ఉన్నారు. దాదాపు 30 మంది జూనియర్ అనలిస్టులు ఉండాల్సిన చోట పది మందే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కూడా చాలా మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తుండడం గమనార్హం. దీంతో శాంపిల్స్ ను టెస్టు చేయడానికి చాలా సమయం పడుతోంది. రెండు రోజుల్లో పూర్తి కావాల్సిన ఒక టెస్టుకు నాలుగు రోజుల సమయం పడుతున్నది.
సరిపడా సిబ్బంది ఉంటే, టెస్టుల సంఖ్య పెరిగి నాసిరకం మందులు ఇంకా ఎక్కువగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, డ్రగ్స్ ఇన్సిపెక్టర్లు కూడా ముషల్కర్ కమిటీ సిఫారసుల ప్రకారం.. 150 మంది ఉండాలి. కానీప్రస్తుతం రాష్ట్రంలో 71 మంది మాత్రమే ఉన్నారు.
దీంతో శాంపిల్స్ సేకరణ పరిమిత స్థాయిలో నే జరుగుతోంది. డ్రగ్ ఇన్స్ పెక్టర్ల సంఖ్య పెరిగితే, శాంపిల్స్ సేకరణ పెరిగి, నాసిరకం మందులు ఇంకా బయటడపే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తామని, మరో 80 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఉన్న రోగం నయం కాక...కొత్త రోగాలకు దారి
నాణ్యత లేని మందుల వాడకం ప్రజల ప్రాణాల మీదికి తెస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులో ఉండాల్సిన మోతాదులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ లేకపోవడం వల్ల వ్యాధి తగ్గకపోగా... ముదిరిపోయే ప్రమాదం ఉంది. కల్తీ రసాయనాలు, నాణ్యత లేని ముడిసరుకుల వాడకం వల్ల మందులు వికటించి కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
తక్కువ మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది. ఇది భవిష్యత్తులో ప్రాణాంతక ఇన్ ఫెక్షన్లకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం నాణ్యత లేని మందుల తయారీ, అమ్మకం తీవ్రమైన నేరం. అయినా, కొందరు నిర్లక్ష్యం, లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డీసీఏ అధికారులు రిస్క్ బేస్డ్ విధానంలో శాంపిళ్లను సేకరించి, నిరంతరం దాడులు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. తక్కువ సంఖ్యలో ఉన్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు, సుదీర్ఘ న్యాయ ప్రక్రియలు కూడా ఈ మాఫియాకు వరంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మందులో మ్యాటర్ సున్నా...
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బయటపడ్డ 88 నాసిరకం మందులను విశ్లేషిస్తే 15 ట్యాబ్లెట్లలో అసలు ఉండాల్సినంత పవర్ (డ్రగ్ కంటెంట్) లేదు. అంటే మనం 500ఎంజీ మందు వేసుకుంటే, అందులో 100ఎంజీ మందు కూడా ఉండట్లేదు. ఇంకా కొన్ని గోళీలైతే ఎలాంటి మందులేని వట్టి సుద్ద బిళ్లలే అని తేలాయి. మోతాదు స్థాయిలో మందు ఉండకపోవడాన్ని వైద్యపరిభాషలో అస్సే(Assey) అంటారు. 48 రకాల మందులు (డిసొల్యూషన్) కడుపులోకి వెళ్లాక... రక్తంలో కలవడం లేదని టెస్టుల్లో తేలింది.
మరో 31 రకాల మందులు... ప్యాకేజీపై తప్పుడు సమాచారం ముద్రించడం, ఐపీ (ఇండియన్ ఫార్మకోపియా) అని ముద్రించకపోవడం, వాడిన రంగుల వివరాలు తెలపకపోవడం మిస్ బ్రాండింగ్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు డీసీఏ టెస్టుల్లో బయటబడింది. ఇక 10 రకాల మందులు విరిగిపోవడం, రంగుమారడం, ద్రావణాలు సరిగా కరగకపోవడం వంటివి తేలాయి. ఈ 88 మందుల్లో కొన్ని మందులు ఒకటి కంటే ఎక్కువ విభాగాలలో నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
