మైకులు బంద్..ముగిసిన మున్సిపల్ఎన్నికల ప్రచారం ..రేపే పోలింగ్

మైకులు బంద్..ముగిసిన మున్సిపల్ఎన్నికల ప్రచారం ..రేపే పోలింగ్
  • నేడు పోలింగ్​ సామగ్రితో తరలివెళ్లనున్న సిబ్బంది
  • -2020 ఎన్నికల్లో 70.26 శాతం పోలింగ్​
  • -ఈ సారి 80 శాతం దాటించేందుకు ఈసీ ప్రయత్నాలు 
  • హైదరాబాద్​లో సెలవు లేకపోవడంతో ఓటింగ్​పై ఎఫెక్ట్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. ఆరు రోజులుగా డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు  ఇప్పుడు ‘సైలెంట్ మోడ్​’ లోకి మారిపోయాయి. ఈ నెల 11న పోలింగ్​ జరగనుండగా 48 గంటల ముందే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు.

మనీ, మందు, ఇతర కానుకలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా  సోమవారం రాత్రి నుంచి మున్సిపాలిటీలపై నిఘా పెట్టారు. మరోవైపు పోలింగ్​ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికలు జరగబోయే ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో  సిబ్బందికి మంగళవారం పోలింగ్​సామగ్రి పంపిణీ కార్యక్రమం ఉంటుంది.  మొత్తం 2,996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా..  మిగిలిన 2,982 వార్డులకు పోలింగ్ జరగనుంది.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 31,428 ఇతర పోలింగ్​ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి తీసుకొని నేటి సాయంత్రం అన్ని పోలింగ్​స్టేషన్లకు చేరుకుంటారు.

జోరుగా మనీ, మందు పంపకాలు

 ఎన్నికలకు 48 గంటలే ఉండడంతో సోమవారం రాత్రే అభ్యర్థులు  ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం పంచుతున్నారు. మేయర్, చైర్​పర్సన్​ ఎన్నికలో ప్రతీ వార్డు కీలకమే కాబట్టి గెలుపుకోసం అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు ఇచ్చే ఫండ్​కు తోడు అభ్యర్థులు సైతం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు.

కార్పొరేషన్లలో ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల దాకా పంచుతుంటే మున్సిపాలిటీల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేల దాకా పంచుతున్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల కుల సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.  జనరల్​స్థానాల్లో నెక్​టూ నెక్​ ఉన్నచోట్ల, రియల్ ఎస్టేట్​భూమ్, ఇండస్ట్రీస్​ఎక్కువగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఒక్కో ఓటుకు రూ.5వేల దాకా పంచుతున్నట్టు చెప్తున్నారు.

మరోవైపు ఉపాధి కోసం హైదరాబాద్​సిటీకి వలస వచ్చిన కుటుంబాలకు అభ్యర్థులు ఫోన్లు చేసి రప్పించుకుంటున్నారు. ఇందుకోసం  రాను, పోను ప్రయాణ ఖర్చులతో పాటు రూ.2వేల నుంచి రూ.3వేల దాకా ఇస్తున్నారు. తమ బంధువుల ద్వారా ముందే యూపీఐ ట్రాన్సాక్షన్స్​ చేయించి రప్పించుకుంటున్నారు. 

పోలింగ్​ శాతం పెరిగేనా?

 మున్సిపల్​ఎన్నికల్లో పోలింగ్​శాతం పెంచేందుకు ఎలక్షన్​కమిషన్​విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 75 శాతానికి పైగానే పోలింగ్​జరిగింది. కొన్ని గ్రామాల్లో 80 నుంచి 90 శాతం వరకు ఓట్లేశారు. కాగా, 2020 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 70.26 శాతం పోలింగ్​నమోదైంది.

పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మున్సిపల్​ ఎన్నికల్లోనూ పోలింగ్​శాతం పెంచాలని ఎలక్షన్​కమిషన్​కసరత్తు చేస్తున్నది. ఒక్క ఓటు అభ్యర్థుల జీవితాలను తారుమారు చేయగలదని.. కాబట్టి అందరూ ఓటెయ్యాలని సోషల్​మీడియా, లోకల్​చానల్స్​లో విస్తృత ప్రచారం చేస్తున్నది. అలాగే, పోలింగ్​కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధుల కోసం  వీల్​చైర్లు అందుబాటులో ఉంచింది. వారిని కేంద్రంలోకి తీసుకువెళ్లి ఓటు వేయించి తిరిగి ఇంటికి పంపించే బాధ్యతను తీసుకుంటున్నది. 

హైదరాబాద్ ​వాసులకు సెలవు సమస్య 

మున్సిపల్​ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 52.43 లక్షలు కాగా, వీరిలో సాఫ్ట్​వేర్​ఇంజినీర్లు, ఇతర ప్రైవేట్​జాబ్​లు చేసేవాళ్లు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు.. కార్మికులు, ఇలా చాలామంది కుటుంబాలతో కలిసి హైదరాబాద్​తో పాటు ఇతర నగరాల్లో ఉంటున్నారు. మున్సిపల్​ఎన్నికల జరిగే ఫిబ్రవరి11న ఎక్కడైతే ఎన్నికలు జరగనున్నాయో అక్కడ మాత్రమే ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

దీంతో హైదరాబాద్ లో ఉంటున్న వారు ఓటు కోసం సొంత ఊళ్లకు చేరుకోవడానికి లీవ్​పెట్టుకోవాల్సి వస్తోంది. లీవ్​ దొరకకపోతే అంతే సంగతులు. ఇదేమైనా పోలింగ్​పై ప్రభావం చూపిస్తుందా? అన్న అనుమానా లు కలుగుతున్నాయి. హైదరాబాద్​లో కూడా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే ఓటింగ్​శాతం  మరింత పెరుగుతుందంటున్నారు.