తెలంగాణలో ఇగ కరెంట్ పోదు.. వచ్చే పదేండ్లకు యాక్షన్ ప్లాన్

తెలంగాణలో ఇగ కరెంట్ పోదు.. వచ్చే పదేండ్లకు యాక్షన్ ప్లాన్
  • కోతల్లేని కరెంట్ సరఫరాకు టీజీఎన్​పీడీసీఎల్ ప్రిపేర్
  • కొత్త లైన్లు, కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు రిపోర్ట్ తయారు
  • డిమాండ్కు సరిపడా పూర్తి స్థాయి వసతుల పైనా ఫోకస్
  • క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు, అవసరాలపై సీఎండీ ఆదేశాలు
  • ప్రపోజల్స్ రూపొందించే పనిలో అన్ని సర్కిళ్ల ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: విద్యుత్ డిమాండ్ను బట్టి నాణ్యతతో పంపిణీ చేసేందుకు తెలంగాణ నార్తర్న్​పవర్​డిస్ట్రిబ్యూషన్​కంపెనీ లిమిటెడ్(టీజీఎన్​పీడీసీఎల్) ప్రిపేర్ అవుతోంది. ఓల్టేజీ ఇష్యూస్, లూజ్ లైన్లు, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కారణంగా కరెంట్​సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్లాన్ చేస్తోంది.

కరెంట్ కోతలను పూర్తిగా నివారించేందుకు వచ్చే పదేండ్ల కాలానికి ప్రణాళికను రూపొందిస్తోంది. ఇప్పటికే ఎన్​పీడీసీఎల్​పరిధిలోని అన్ని సర్కిళ్ల ఆఫీసర్లకు సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించడంతో పాటు అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ను బట్టి..
ఎన్​పీడీసీఎల్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రా ద్రి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్​, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్​, మంచిర్యాల, ఆసిఫాబాద్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ16 సర్కిళ్లలో డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్కు కలిపి 68.34 లక్షలు, 12.2 లక్షలకుపైగా అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి.

సంస్థ పరిధిలో రోజుకు 4 వేల మెగావాట్ల విద్యుత్  డిమాండ్ ఉంటోంది. సమ్మర్లో మరింత ఎక్కువగా ఉంటుండగా.. ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో కొన్నిచోట్ల ట్రాన్స్​ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడుతోంది. మరోవైపు ఏటేటా  విద్యుత్ డిమాండ్​పెరిగిపోతుండగా భవిష్యత్లోనూ మరింత ఎక్కువయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంచనా వేశారు. 

రాబోయే పదేండ్ల ప్రణాళికపై ఫోకస్
సంస్థ పరిధిలోని సర్కిళ్లలో ఏడాదికి అన్నీ కలిపి లక్షకుపైగా కొత్త కనెక్షన్లు మంజూరవుతున్నాయి. ఇలా కొత్తగా కరెంట్ డిమాండ్​పెరుగుతుండడంతో చాలాచోట్ల లూజ్​లైన్లు, ఓల్టేజీ ఇబ్బందులతో సరఫరాలో అంతరాయా లు తలెత్తుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిష్కరించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా వసతులు కల్పించేందుకు సంస్థ కసరత్తు చేపట్టింది. 

రాబోయే ఐదేండ్లు, పదేండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇటీవలే సీఎండీ వరుణ్​రెడ్డి అన్ని సర్కిళ్ల ఆఫీసర్లతో సమావేశమై కరెంట్ డిమాండ్​కు తగ్గట్టుగా, అంతరాయాలు లేకుండా సరఫరా చేసే చర్యలపై చర్చించారు. వచ్చే పదేండ్లకు డీటెయిల్డ్​రిపోర్ట్స్​ రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు.

ప్రపోజల్స్ ​రెడీ చేస్తోన్న ఆఫీసర్లు
అన్ని సర్కిళ్లలోని ఆఫీసర్లు రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. కొత్త లైన్లు, డిస్ట్రిబ్యూషన్, పవర్​ట్రాన్స్​ఫార్మర్లు,  కొత్త సబ్​స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. లోడ్​ఎక్కువగా నమోదయ్యే సర్కిళ్లలో కొత్త 132/33 కేవీ సబ్​స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్​లింకింగ్ లైన్లను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అన్ని సర్కిళ్ల సమగ్ర నివేదికకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలు వేసి పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విద్యుత్ లోడ్కు అనుగుణంగా సబ్​స్టేషన్లు
సీఎండీ ఆదేశాల మేరకు వచ్చే ఐదు, పదేండ్లకు అవసరమైన పనులను గుర్తిస్తున్నాం. విద్యుత్ లోడ్​కు అనుగుణంగా కొత్త లైన్లు, సబ్​స్టేషన్లు, సామర్థ్యం పెంపు వంటి ఇతర పనులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. సమగ్ర నివేదిక రూపొందించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు​తీసుకుంటాం. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా చూస్తున్నాం.

పి.మధుసూదన్​రావు, ఎస్ఈ, హనుమకొండ