ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు.. గోదావరి-కావేరి లింక్​పై తెలంగాణ అభ్యంతరం

ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు.. గోదావరి-కావేరి లింక్​పై తెలంగాణ అభ్యంతరం
  • ఎన్​డబ్ల్యూడీఏ లేఖపై పది రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు
  • అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్టులు
  • అయినా ముందుకే వెళ్తుండడంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు
  • ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని ఆందోళన

హైదరాబాద్, వెలుగు: కావేరి, గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కట్టేందుకు కేంద్రం నిర్ణయించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అక్కడ బ్యారేజీ వద్దని ఇప్పటికే పలుమార్లు నివేదించినప్పటికీ ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకోవడంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే దీనిపై అభ్యంతరాలను తెలియజేయాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. 

ఈ మేరకు వారంలోపు దానిపై రిపోర్ట్ తయారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తమకున్న అభ్యంతరాలను తెలియజేసినా పట్టించుకోకుండా ఇచ్చంపల్లి దగ్గరే బ్యారేజీని నిర్మించాలనుకోవడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టేందుకు నిర్ణయించామని, నెలాఖరులోపు అభ్యంతరాలను తెలియజేయాలంటూ ఇరిగేషన్ శాఖకు నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా అభ్యంతరాలతో రిపోర్టను తయారు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్​డబ్ల్యూడీఏ పూర్తి రిపోర్టు, రాసిన లేఖపై స్టడీ చేయడం ప్రారంభించినట్టు తెలిసింది. వారం పది రోజుల్లోనే ఎన్​డబ్ల్యూడీఏకి అభ్యంతరాలతో కూడిన రిపోర్టును ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

మన అభ్యంతరాలివి..

ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దని, తుపాకులగూడెం (సమ్మక్క బ్యారేజీ) నుంచే గోదావరి కావేరి లింకింగ్​లో నీళ్లు తీసుకోవాలని తెలంగాణ వాదిస్తున్నది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీని నిర్మించడం వల్ల ముంపు ఎక్కువ అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి దిగువన, తుపాకులగూడెం ఎగువన (అంటే రెండింటి మధ్యలో) ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించేందుకు ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. అయితే, అది తుపాకులగూడెం నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో.. మేడిగడ్డ నుంచి 37 కిలోమీటర్ల దూరంలోనే బ్యారేజీ ఉంటుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తుపాకులగూడెం బ్యారేజీ 85 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే.. అందుకు జస్ట్ రెండు మీటర్ల ఎత్తుతోనే ఇచ్చంపల్లి బ్యారేజీని ఎన్​డబ్ల్యూడీఏ ప్రపోజ్ చేసింది. దీని వల్ల ముంపు ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. 

మూడు బ్యారేజీల మధ్య దూరం తక్కువే అయినందువల్ల వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు నీటి విడుదలలో తీవ్రమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. వరదలు పరిమితిని దాటి వస్తే మేనేజ్ చేయడమూ ఇబ్బందేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇచ్చంపల్లివద్ద బ్యారేజీని కడితే ఇటు దిగువన ఉన్న తుపాకులగూడెంతోపాటు.. అటు ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ కూడా ముంపు బారిన పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఆశించిన దానికన్నా తక్కువ వరదలు వస్తే ఇచ్చంపల్లికి దిగువన ఉన్న తుపాకులగూడెంతో పాటు దేవాదుల, సీతరామ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయా బ్యారేజీల అవసరాలే దాదాపు 158 టీఎంసీల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీని నిర్మించకుండా తుపాకులగూడెం నుంచే నీటిని తీసుకోవాలంటూ ఇప్పటికే అధికారులు ప్రతిపాదించారు.

నీటి వాటాల్లో అన్యాయం..

కేంద్ర ప్రభుత్వం నీటి వాటాలను తేల్చకుండానే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ముంగటేసుకోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ముందు వాటాలు తేల్చాక ప్రాజెక్టుపై మాట్లాడాలని స్పష్టం చేస్తున్నారు. చత్తీస్​గఢ్ వాడుకోని 141 టీఎంసీల మిగులు జలాలనే అనుసంధాన ప్రాజెక్టులో వాడుకునేలా ప్రాజెక్టును తలపెట్టారు. అందులో తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8, తమిళనాడుకు 38.6, కర్నాటకకు 9.8 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీల చొప్పున కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

అయితే, కర్నాటకకు నీటిని కేటాయించడంపట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. బేసిన్​లోని రాష్ట్రాలకు కాకుండా కర్నాటకకు కేటాయించడం వల్ల బేసిన్​లోని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదిస్తున్నది. అంతేగాకుండా గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువున్న తెలంగాణ నుంచే బ్యారేజీని ప్రతిపాదిస్తుండడంతో రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్​ చేస్తున్నది. ఆ వాటాలు ఇప్పుడు తేల్చకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామనడంపై అభ్యంతరం తెలుపుతున్నది.