శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌‌‌‌కు.. అక్రమ లైనింగ్

శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌‌‌‌కు..  అక్రమ లైనింగ్
  • గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలుఅతిక్రమించిన ఏపీ
  • సంగమేశ్వర ఎత్తిపోతలకు కొనసాగింపుగా కాల్వ పనులు 
  • కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను కబ్జా పెట్టే కుట్రలకు ఏపీ మరింత పదును పెట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను అతిక్రమించి అక్రమంగా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ)కు ఎలాంటి అనుమతుల్లేకుండానే లైనింగ్ చేస్తోంది. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంతో పాటే ఎస్ఆర్ఎంసీకి సిమెంట్ లైనింగ్ చేసేందుకు 2020 మే 5న ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఈ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మొదట్లో నోరు విప్పలేదు. ‘వీ6 వెలుగు’ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఎండగట్టడంతో అనివార్యంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రైతు న్యాయ పోరాటంతో సంగమేశ్వరం ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్‌‌‌‌లో ఇంప్లీడ్ అయ్యింది. సంగమేశ్వరం ఎత్తిపోతలతో పాటు దానికి సంబంధించిన ఏ పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ 2021 డిసెంబర్ 17న స్టే ఇచ్చింది. దీంతో కొన్నాళ్లు ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిన ఏపీ.. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా కెనాల్‌‌‌‌కు సిమెంట్ లైనింగ్ చేసే పనులు మొదలు పెట్టి, చాలా వరకు పూర్తి చేసింది. అక్రమంగా చేస్తున్న ఈ పనులను వెంటనే నిలిపి వేయించాలని కోరుతూ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శనివారం కేఆర్ఎంబీ చైర్మన్ శివ్ నందన్ కుమార్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.

రోజుకు 7 టీఎంసీలు తరలించేలా.. 

‘‘1977లో చేసుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం చెన్నై తాగు నీటిని కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్ఎంసీకి రోజు 1,500 క్యూసెక్కులను మాత్రమే తరలించాలి. అయినా ఏపీ 11,500 క్యూసెక్కులు తరలించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించింది. తర్వాత దానిని 40 వేల క్యూసెక్కులకు పెంచింది. ఇప్పుడు 80 వేల క్యూసెక్కులకు పెంచేలా కొత్త గేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇలా గేట్ల ద్వారా తీసుకునే నీటిని తరలించేందుకు అనువుగా ప్రస్తుతం ఎస్ఆర్ఎంసీకి లైనింగ్ చేస్తోంది. ఇప్పుడున్న కాల్వ ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉండగా, ఇప్పుడు లైనింగ్‌‌‌‌ చేయడం ద్వారా కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. ఈ లెక్కన ఏపీ ఒక్క రోజుకు గ్రావిటీ ద్వారా 7 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలోని కృష్ణా బేసిన్‌‌‌‌లోని కరువు ప్రభావ ప్రాంతాల హక్కులు పరిరక్షించేందుకు ఏపీ చేస్తున్న అక్రమ పనులను వెంటనే నిలిపి వేయించండి”అని ఫిర్యాదులో మురళీధర్‌‌‌‌‌‌‌‌ కోరారు.