- విదేశాల్లో ఉద్యోగాలకు వేల సంఖ్యలో నిరుద్యోగుల దరఖాస్తులు
- ఇజ్రాయెల్, గ్రీస్, జర్మనీలో జాబ్స్‌కు వేల సంఖ్యలో అప్లై
- నెలకు రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వేతనంతో కొలువులు
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్ ) అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. దళారుల మోసాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వమే స్వయంగా ఈ నియామక ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, గ్రీస్, జర్మనీ, జపాన్, రష్యా తదితర దేశాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. అనూహ్య స్పందన వచ్చిందని టామ్‌కామ్ అధికారులు చెబుతున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ డిగ్రీ, డిప్లొమా ఉన్న నిరుద్యోగులు గ్రీస్ లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా.. రికార్డు స్ధాయిలో 5 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అలాగే, ఇందులో హౌస్ కీపింగ్, హోటల్ రిసెప్షనిస్ట్ , వెయిటర్స్, బార్ అటెండర్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. వారికి ప్రారంభ వేతనం రూ. 97 వేలు ఉంది. అలాగే, ఫిజి ఐస్ ల్యాండ్ లో వెటర్నరీ డాక్టర్ల పోస్టులకూ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఈ పోస్టుకు నెలకు రూ.2.50 లక్షల వేతనం చెల్లించనున్నారు. జర్మనీలో స్టాఫ్ నర్స్ జాబ్‌లు ఉండగా వీటికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వేతనం చెల్లించనున్నారు. వీటితో పాటు ఖతార్, యూకే, మారిషస్, ఇజ్రాయెల్ లో జాబ్ లకు అప్లికేషన్లు చేసుకోవాలని టామ్‌కామ్ అధికారులు కోరారు. జర్మనీలో వేర్ హౌస్ అసిస్టెంట్స్, ఎలక్ట్రిషియన్స్ జాబ్ లకు 2 వేల అప్లికేషన్లు వచ్చాయని టామ్ కామ్ అధికారులు చెబుతున్నారు. గ్రీస్‌లో జాబ్ లకు 2 వేల మంది, రష్యాలో జాబ్ లకు 245 మంది అప్లై చేసుకున్నారు. ఈ అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. రూల్స్ కు తగ్గట్టుగా ఉన్న అప్లికేషన్లను ఎంపిక చేసి బ్యాచ్ లుగా డివైడ్ చేసి ఆయా దేశాలకు టామ్ కామ్ అధికారులు పంపనున్నారు. టామ్ కామ్ ద్వారా వెళ్లే వారికి వీసా ప్రాసెసింగ్, విదేశాల్లో భద్రత, శిక్షణ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని.. కాబట్టి, ప్రైవేట్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
