రెండో విడతలో 20వేలకుపైగా నామినేషన్లు

రెండో విడతలో  20వేలకుపైగా నామినేషన్లు
  • రెండు రోజుల్లో సర్పంచ్  కోసం 12,479.. వార్డులకు 30,040 నామినేషన్లు

హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. తొలిరోజు ఆదివారం కాస్త మందకొడిగా సాగినా.. సోమవారం పుంజుకున్నాయి. మూడురోజైన మంగళవారం సైతం నామినేషన్లు పోటెత్తాయి. 

సోమవారం వరకు  4,332 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్​ కోసం12,479 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 30,040 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు  2,976 నామినేషన్లు మాత్రమే రాగా..  సోమవారం ఒక్కరోజే 9,503 నామినేషన్లు దాఖలవడం విశేషం. మూడురోజు మంగళవారం భారీగా నామినేషన్లు వేశారు. 


వీటికి సంబంధించిన వివరాలు జిల్లాల నుంచి రావడానికి సమయం పడుతుండటంతో  వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. మూడో రోజు కూడా కలుపుకుంటే రెండో విడతలో మొత్తం 20 వేలకుపైగా నామినేషన్లు రావొచ్చని అధికారులు అంచనా. సర్పంచ్ నామినేషన్లలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 282 పంచాయతీలకు గాను 883 నామినేషన్లు దాఖలయ్యాయి. 

రెండో స్థానంలో  సిద్దిపేటలో 182 పంచాయతీలకు 701, మూడో స్థానంలో సంగారెడ్డి 243  పంచాయతీలకు 657 ఉన్నాయి. వార్డు సభ్యుల విషయానికి వస్తే.. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 2,070 నామినేషన్లు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో అతి తక్కువగా  52 పంచాయతీలకు 113 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 85 పంచాయతీలకు190, జోగులాంబ గద్వాలలో 74 పంచాయతీలకు 205 నామినేషన్ల వేశారు.

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు..

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లావారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్​ ప్రకటించి అనంతరం ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఆ  వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఈ విడతలో 4,159 పంచాయతీలకు 36,452 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 

నేటి నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 7న వినతులు స్వీకరిస్తారు. 8న వినతులను పరిష్కరించనున్నారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 

మరోవైపు ఎన్నికల సన్నద్ధతపై స్టేట్​ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని.. పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ సృజన, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై చర్చించారు.