
ఎల్బీనగర్, వెలుగు : కాంగ్రెస్‌ప్రభుత్వ వంద రోజుల పాలనను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహకంలో భాగంగా ఆదివారం కర్మన్‌ఘాట్ లో ఎల్బీనగర్అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని గెలిపించినట్లుగా ఈసారి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతామహేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుక్కుగూడలో నిర్వహించిన సోనియాగాంధీ సభతో జనం కాంగ్రెస్‌పార్టీకి పట్టం కట్టారని, అదే తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో త్వరలో ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను సక్సెస్చేయాలని కోరారు.
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. మూసీ ప్రక్షాళన, సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ దుర్మార్గ పాలనకు, వంద రోజుల ప్రజాపాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మొన్నటి దాకా చేసిన కబ్జాలను కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ఆయన్ని రానిచ్చే ప్రసక్తే లేదన్నారు.
సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం సేవలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతా ఉన్నాయన్నారు. మహేందర్ రెడ్డి రెండు సార్లు జిల్లా మంత్రిగా పనిచేసి ఎల్బీనగర్కు సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, చల్లా నరసింహారెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.