చైతన్య గీతం మెలకువ తీరం.. తెలంగాణ మాండలికం.. ఉద్యమకాలం నాటి స్థితిగతులు

చైతన్య గీతం మెలకువ తీరం.. తెలంగాణ మాండలికం.. ఉద్యమకాలం నాటి స్థితిగతులు

పండితుల పద్యమైనా, జనపదుల జానపదమైనా, పండిత పామరులు మెచ్చే వచన రూపమైనా మనిషిని/సమాజాన్ని తట్టిలేపే/ఆలోచింపచేసే కవిత్వానిది ప్రత్యేక స్థానం. కవి మోతుకూరి అశోక్​కుమార్​ రాసిన ‘మెలకువ తీరం’ కవితా సంపుటి అలాంటి చైతన్య గీతమే. ఆధునిక సమాజపు పోకడల్ని, ప్రపంచీకరణ ప్రభావాల్ని ప్రస్తావిస్తూ, ప్రశ్నిస్తూ, నిలదీస్తూ సాగే కవిత్వం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. 

ఇందులోని కవిత్వం చిన్నపిల్లల నుంచి మహిళల వరకు ప్రకృతి నుంచి పల్లె జీవనం వరకు అందరి పక్షాన వకాల్తా పుచ్చుకుంది. కాల మార్పుల్ని స్పృశిస్తూ  మెలకువ తత్వాన్ని బోధిస్తుంది. మోత బరువుల చదువుల్లో నలిగిపోతున్న పిల్లలను పూలతో పోలుస్తూ ‘సుకుమారంగా.. తెలివిగా.. అల్లితేనే  పూలు దండలై శోభిల్లుతాయి.. లేకుంటే దండగైపోతాయి’ అని చెప్పే ‘పూల వాకిలి’ పెద్దల బాధ్యతనూ గుర్తుచేస్తుంది. 

వయసు మీదపడి, దేహం మంచాన పడినవాళ్ల దుస్థితిని ‘పెనవేసుకున్న రూపాయి బంధాల నడుమ చెల్లుబాటు కాని జీవితాలు అందరికీ బరువే..’  అంటూ దిగుమతి నాగరికతల మాయగా చెబుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని కొనుగోల్​‘ మాల్​’ బురిడీల గురించి హెచ్చరిస్తూ ‘వెలుగుల మాయలో చీకటి పండుతోంది.. మీ జేబులు జాగ్రత్త’ అని హెచ్చరిస్తుంది. కరోనా విలయంలో వలస జీవుల బతుకు ప్రయాణాన్ని ‘ఎగిరిపోయే చిల్లుల గుడిసె.. ఎన్నో ఊళ్ళ మీదుగా కదలిపోతోంది..’ అంటూ అప్పటి దురవస్థను కళ్లకు కడుతుంది. 

రాళ్లూరప్పలు, మబ్బులు మెరుపులూ కూడా రచయిత చేతుల్లో​ కవితలుగా మారి సమాజం/మనిషిలోని చెడు లక్షణాలను నిగూఢంగా ఎత్తిచూపాయి. ‘రాళ్లకు రహస్యాల్లేవు.. అంతా బహిరంగమే.. కప్పుకోవటమూ.. విప్పుకోవటమూ.. అంతా మనుషులకే’, ‘అప్పుడప్పుడు మబ్బులు మనుషుల్లా కనబడతాయి.. క్రూరమృగాల్లా దర్శనమిస్తాయి.. నిర్ధాక్షిణ్యపు నీడలవుతాయి’ అనే పంక్తులు కొన్ని ఉదాహరణలు. పుస్తకంలో మొత్తం 44 కవితా పుష్పాలున్నాయి. ఒకటో రెండో మినహా అన్నీ పేజీ, అరపేజీ కవితలే. వేటి ప్రత్యేకత వాటిదే. 

సమకాలీన సమాజంలోని వస్తువులు రచయిత చేతిలో కవితలుగా మారాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితులతోపాటు ఉద్యమకాలం నాటి స్థితిగతులూ ఈ కవితల్లో కనిపిస్తాయి. భాష సరళంగా ఉంది. కఠినమైన పదబంధాలు, వాక్యాలు కనిపించవు.  తెలంగాణ మాండలికం సొబగులద్దింది. 

- జి. మహేశ్వర్​-