
- ఏప్రిల్ 14న స్టేట్, రేంజ్ అథారిటీల ఏర్పాటు
- వాటి సేవల కోసం ఎదురుచూస్తున్న జనం
హైదరాబాద్, వెలుగు: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు తెచ్చిన ‘పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ’ కార్యకలాపాలు ఇంకా ప్రారంభించలేదు. ఏప్రిల్ 14న స్టేట్, రేంజ్ అథారిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెలలు గడుస్తున్నా అథారిటీలకు ఆఫీసుల్లేకపోవడంతో బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉంది. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై ఇటీవలే హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ కార్యకలాపాలు ప్రారంభిస్తే బాధితులకు ఊరట లభించనున్నది.
రాష్ట్ర హోంశాఖ ఏప్రిల్ 14న ఉత్తర్వులు
రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, లా అండ్ ఆర్డర్ డ్యూటీ వదిలేసి సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా.. వారిలో మార్పు రావడం లేదు. దీంతో ఇలాంటి పోలీస్ ఆఫీసర్లపై ఫిర్యాదుల కోసం స్టేట్, రీజినల్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 14న రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్‌గా ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శివశంకర్ రావు, సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ ప్రమోద్ కుమార్, సమాచార కమిషన్ మాజీ సభ్యుడు, అడ్వకేట్ వర్రే వెంకటేశ్వర్లు, లా అండ్ ఆర్డర్ డీజీపీను నియమించింది. వీరితో పాటు హైదరాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా రీజియన్లకు కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు లక్డీకాపూల్‌లోని డీజీపీ ఆఫీస్‌కు బాధితులు వస్తున్నారు. బీఆర్‌కే భవన్‌లో స్టేట్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ, గగన్‌విహార్‌లో హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్ రీజియన్ల డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఆఫీసులను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు హోంశాఖ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు.
సుప్రీం ఆదేశాలు పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్
పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించడం, కస్టోడియల్ మరణాలు, పోలీసుల దురుసు ప్రవర్తన సహా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై ఫిర్యాదు చేయాల్సి వస్తే రాష్ట్ర, జిల్లా స్థాయిలో అథారిటీలను ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడు, గుజరాత్, పంజాబ్, కర్నాటక, హర్యానా, అస్సాం, మహారాష్ట్ర ప్రభుత్వాలు అథారిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వెబ్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి.
కానీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అథారిటీలను ఏర్పాటు చేయలేదు. దీంతో 2018లో పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. 2 నెలల్లో అథారిటీల కార్యకలాపాలు ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 2021, జులైలో తెలంగాణ స్టేట్, రీజినల్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. కానీ వారికి ఆఫీసులను కేటాయించలేదు.
కసరత్తు ప్రారంభించిన డీజీపీ ఆఫీస్
పోలీస్ కంప్లైంట్ అథారిటీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు డీజీపీ ఆఫీస్ నుంచి కసరత్తు మొదలైంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైర్మన్, సభ్యులకు అవసరమైన చాంబర్లు, సిబ్బంది, ఫర్నిచర్ సహా అన్ని సౌలత్లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నది. రాష్ట్ర స్థాయి అథారిటీలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆపై స్థాయి అధికారులు, హైదరాబాద్, వరంగల్ రేంజ్ రీజియన్‌లో జిల్లా స్థాయి అధికారులతో పాటు కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీలపై ఫిర్యాదు చేయొచ్చు.
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలు, చైర్మన్, సభ్యులు వీరే..
రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీలో చైర్మన్‌గా ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శివ శంకర్ రావు, సభ్యులుగా పి.ప్రమోద్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), వర్రే వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది (సమాచార కమిషన్ మాజీ సభ్యుడు), సభ్యకార్యదర్శిగా అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్). హైదరాబాద్ రీజియన్ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి కె.సుదర్శన్, సభ్యులుగా పి.రామ్మోహన్ (మాజీ జర్నలిస్ట్), రామ నర్సింహారెడ్డి (రిటైర్డ్ ఏఎస్పీ), మెంబర్ సెక్రటరీగా ఇన్‌స్పెక్టర్ జనరల్(మల్టీజోన్ -2). వరంగల్ రీజియన్ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా వై.అర్వింద్ రెడ్డి (రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి), సభ్యులుగా నారాయణ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ సామల రాజేందర్, మెంబర్ సెక్రటరీగా ఇన్‌స్పెక్టర్ జనరల్ (మల్టీజోన్ 1).