అటాక్స్.. రివార్డ్స్!

అటాక్స్.. రివార్డ్స్!

 

  •  డ్రగ్స్ టార్గెట్ గా పోలీసుల ఆపరేషన్

  •  అధునాతన పరికరాలతో పబ్ లపై దాడి

  •  అక్కడే పరీక్షలు.. ఆ వెంటనే కేసులు

  •  క్వింటాలు గంజాయి సమాచారం ఇస్తే 2 లక్షలు 

  •  డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం


హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే ఆపరేషన్ మొదలైంది. నార్కోటిక్ అనాలసిస్ బ్యూరో ప్రస్తుతం పబ్స్‌పై ఫోకస్ పెట్టింది. ఏకకాలంలో పదుల సంఖ్యలో పోలీసులు .. పబ్స్‌ పై దాడులు చేస్తున్నారు. ఎవరూ తప్పించుకోకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుగానే సిబ్బందిని మోహరిస్తున్నారు. అక్కడికక్కడే యూరిన్ టెస్ట్ ద్వారా ఏ రకం డ్రగ్స్ ఎంత మోతాదులో తీసుకున్నారో తేల్చేస్తున్నారు. 

సీన్ కట్ చేస్తే ఇక కటకటాలే!

 ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు.  ఇటీవల మణికొండలోని కేవ్‌ పబ్‌పై నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో , ఎస్వీటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి  దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ అక్కడికక్కడే టెస్టులు చేయగా, 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వాళ్లు గంజాయి, హెరాయిన్, మెథ్, ఎల్ఎస్డీ తీసుకున్నారని వెంటనే తేల్చేశారు. పట్టుబడిన వాళ్లలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఉండటం గమనార్హం.

ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2లక్షలు

గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడంతోపాటు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.... ఎవరికి చేరుతుంది... దీని వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్వింటాలు గంజాయికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా వెల్లడించడంతో పోలీసులకు పక్కా సమాచారం చేరుతోంది. ..దీంతో ప్రతిరోజూ గంజాయి, డ్రగ్స్ ను పట్టుకుంటున్నట్టు సమాచారం.  
 
పోలీసులకు ప్రమోషన్లు 

అధునాత పరికరాల వినియోగంతోపాటు నిరంతంర దాడులతో మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి పెడ్లర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు పోలీసులు. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పట్టుకోవడంతోపాటు సైబర్ నేరాలను నియంత్రించడంతో కృషి చేసిన వారికి నగదు రివార్డుతోపాటు... ప్రమోషన్లు కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతో పోలీసులు మరింత సీరియస్ గా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.