శాంతిభద్రతల్లో తెలంగాణ నంబర్‌‌ వన్‌‌ - మహమూద్‌‌ అలీ

శాంతిభద్రతల్లో తెలంగాణ నంబర్‌‌ వన్‌‌ - మహమూద్‌‌ అలీ

గోదావరిఖని, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌‌ వన్‌‌గా నిలిచారని హోం మంత్రి మహమూద్‌‌ అలీ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రూ. 3.6 కోట్ల సింగరేణి సీఎస్‌‌ఆర్‌‌ నిధులతో నిర్మించిన మోడల్‌‌ వన్‌‌ టౌన్ పోలీస్‌‌ స్టేషన్ భవనం, రూ.3.4 కోట్ల ఎన్టీపీసీ నిధులతో నిర్మించిన పోలీస్‌‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌‌ సెంటర్‌‌(గెస్ట్‌‌హౌస్), అంతర్గాంలో రూ.1.5 కోట్ల పోలీస్‌‌ హౌసింగ్‌‌ కార్పొరేషన్‌ నిధుల‌తో నిర్మించిన పోలీస్‌‌ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌ పోలీసు వ్యవస్థకు పెద్దపీట వేస్తూ శాంతిభద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. దేశం మొత్తం ఉన్న సీసీ కెమెరాలలో రాష్ట్రంలోనే 64 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. తద్వారా నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు.

పోలీస్ శాఖలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. గోదావరిఖనిలో మహిళా పోలీస్‌‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ కోరగా నెలరోజుల్లో జరగనున్న మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ  పోలీస్ స్టేషన్ దేవాలయం లాంటిదని, ఇక్కడకు వచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్‌‌ నేత, పోలీస్‌‌ హౌజింగ్‌‌ కార్పొరేషన్ చైర్మన్‌‌ కోలేటి దామోదర్‌‌, జడ్పీ చైర్మన్‌‌ పుట్ట మధు, కలెక్టర్‌‌ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.