
- తమదే విజయమంటున్న బీఆర్ఎస్
- సత్యం ధర్మం గెలిచిందన్న కేటీఆర్
- స్పీకర్ ప్రాధాన్యాన్ని గుర్తించిందన్న కాంగ్రెస్
- బీఆర్ఎస్కు చెంప పెట్టులాంటిదన్న చామల
- స్వాగతిస్తున్నామంటున్న బీజేపీ
- హాట్ టాపిక్గా ఎమ్మెల్యేల అనర్హత కేసు
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు ప్రధాన పార్టీలు తమదే విజయమని చెప్పుకుంటున్నాయి. దీంతో గందరగోళం నెలకొంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ సీజేఐ బెంచ్ ఇవాళ తీర్పు చెప్పింది. దీనిపై బీఆర్ఎస్ స్పందించింది. ఈ తీర్పు తాము ఊహించామని తెలిపింది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సత్యం, ధర్మం గెలిచిందని పేర్కొన్నారు.
అదే సమయంలో పాంచ్ న్యాయ్ ని ప్రచారం చేసిన రాహుల్ గాంధీ సుప్రీం తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. అంతే స్థాయిలో కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది. తాము తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపింది.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు బీఆర్ఎస్ కు చెంపపెట్టులాంటిదన్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ ప్రాధాన్యాన్ని గుర్తించిందని చెప్పారు. సుప్రీంకోర్టే అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ పగటి కలలు కన్నదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పును స్వాగతించారు.
►ALSO READ | సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. 2004 కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు స్పీకర్ ఎమ్మెల్యేల విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదని, దాటా వేశారని అన్నారు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే బీజేపీ అన్ని స్థానాల్లోనూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.