- హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి
ఉప్పల్, వెలుగు: రాష్ట్ర యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించే దిశగా ‘తెలంగాణ ప్రీమియర్ లీగ్’ (టీపీఎల్)ను నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు తెలిపారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి, సీఈఓ ఇంతియాజ్ అలీతో కలిసి ఆయన లీగ్ వివరాలను వెల్లడించారు.
జూన్ నుంచి పోటీలు.. త్వరలో ట్రయల్స్
తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దడమే టీపీఎల్ లక్ష్యమన్నారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ఈ పోటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లతో త్వరలో ఓపెన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర క్రికెట్కు కొత్త జవజీవాలు అందిస్తామని రాయుడు పేర్కొన్నారు.
హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేకుండా, 10 మంది మాజీ క్రికెటర్లతో కూడిన ప్రత్యేక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
