హైదరాబాద్, వెలుగు: రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, డిస్కంలు ముందస్తుగా సన్నాహాలు చేసుకోవాలని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శనివారం మింట్ కాంపౌండ్‌లోని సదరన్ డిస్కం కార్పొరేట్ ఆఫీసులో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎనర్జీ సెక్రటరీ మిట్టల్ మాట్లాడుతూ గత వేసవిలో 17,162 మెగావాట్లకు గరిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ ముందస్తు చర్యలతో సమస్యలు రాలేదని తెలిపారు. వచ్చే సమ్మర్ నాటికి గరిష్ట డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నాటికి విద్యుత్ లైన్ల రిపేర్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
సదరన్ డిస్కం పరిధిలో 72, నార్తర్న్ డిస్కం పరిధిలో 31 నూతన సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని 181ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అదనంగా సదరన్ డిస్కంలో 8,384, నార్తర్న్ డిస్కంలో 5,280 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన సేవలు అందించేందుకు ఎల్టీ/11 కేవీ స్థాయిలో ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే అమలవుతున్న స్కాడా సిస్టమ్ ను గ్రామాల వరకు విస్తరించాలని సూచించారు.
