టీచర్ల రేషనలైజేషన్ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో!.. అక్కర్లేని చోట పోస్టుల కోత.. అవసరమున్న చోట భర్తీ

టీచర్ల రేషనలైజేషన్ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో!.. అక్కర్లేని చోట పోస్టుల కోత.. అవసరమున్న చోట భర్తీ
  •     పదేండ్ల తర్వాత కసరత్తు.. జీవో 25 ప్రకారం సర్దుబాటు
  •     మిగులు టీచర్లకు కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్  
  •     త్వరలో సర్కార్‌‌‌‌కు విద్యాశాఖ ప్రతిపాదనలు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ టీచర్ల రేషనలైజేషన్‌‌‌‌కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు లేకపోయినా, తక్కువగా ఉన్నా అక్కడ మిగులుగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువగా ఉండి, టీచర్లు సరిపోని స్కూళ్లకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు త్వరలోనే సర్కారుకు పంపించే యోచనలో ఉన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26 వేల సర్కారు బడుల్లో 1.10 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. చాలా చోట్ల విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాత్కాలిక పద్ధతిలో ప్రతిఏటా స్కూళ్లు ప్రారంభమైన తర్వాత టీచర్లకు వర్క్ అడ్జెస్ట్ మెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలోనూ పొలిటికల్ ప్రెషర్ తో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 1:16 / 1: 17 టీచర్, స్టూడెంట్ రేషియో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ రివ్యూలోనూ టీచర్ల రేషనలైజేషన్ పై చర్చ జరిగింది. దీంతో జీవో నంబర్ 25ను ప్రామాణికంగా తీసుకుని, టీచర్ల రేషనలైజేషన్ వేసవిలో పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. 2025– 26 యూడైస్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. 

2015 తర్వాత..

రాష్ట్రంలో చివరిసారిగా 2015లో టీచర్ల రేషనలైజేషన్ జరిగింది. అప్పట్లో సుమారు 15 వేల పోస్టులను అవసరం లేని చోట నుంచి అవసరం ఉన్న స్కూళ్లకు షిఫ్ట్ చేశారు. ఇదే సమయంలో అవసరం లేదని మరో 5వేల పోస్టులను డీఈవో పోల్‌‌‌‌లో పెట్టారు. ఇప్పటికీ ఆ పోస్టులను బయటకు చూపించడం లేదు. 

ఈ క్రమంలో అప్పటి నుంచి ప్రతి ఏటా తాత్కాలికంగా 'వర్క్ అడ్జస్ట్‌‌‌‌మెంట్' చేస్తున్నారే తప్ప.. శాశ్వత ప్రాతిపదికన పోస్టుల రేషనలైజేషన్ జరగలేదు. ప్రస్తుతం ఒక్కో స్కూల్‌‌‌‌లో ఒక్కో రకంగా టీచర్ల సంఖ్య ఉండటంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. 

జీవో 25 ప్రకారమే.. 

జీవో 25 ప్రకారం రేషనలైజేషన్ చేపట్టనున్నారు. ప్రైమరీ స్కూల్స్ లో 1 నుంచి 19 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 20 నుంచి 60 మంది వరకు ఇద్దరు, 61 నుంచి 90 మంది వరకు ముగ్గురు టీచర్లు ఉంటారు. ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌‌‌‌ను అదనంగా కేటాయిస్తారు. హైస్కూళ్లలో 220 మంది విద్యార్థుల వరకు కనీసం 9 మంది టీచర్లు (సబ్జెక్టు టీచర్లు, పీఈటీ, హెచ్‌‌‌‌ఎం కలిపి) ఉంటారు. 

ఆ తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను అలాట్ చేస్తారు. ఈ క్రమంలోనే సుమారు 1,500 జీరో ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్ స్కూళ్లలోని టీచర్ పోస్టులను చూపించరు. అక్కడ మంజూరైన పోస్టులను రద్దు చేసి, లేదా అవసరం ఉన్న ఇతర స్కూళ్లకు మళ్లిస్తారు. రేషనలైజేషన్‌‌‌‌లో మిగులుగా తేలిన టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఖాళీలు ఉన్న చోటుకు బదిలీలు చేస్తారు.