కేంద్ర నిధుల కోసం మున్సిపల్ శాఖ కసరత్తు

కేంద్ర నిధుల కోసం మున్సిపల్ శాఖ కసరత్తు
  • 2 వేల కోట్ల విలువైన ప్రపోజల్స్ తో రిపోర్ట్ రెడీ 
  • ఈ నెలాఖరులోగా కేంద్రానికి సమర్పించే ఛాన్స్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్-2025~-26’ (సాస్కీ) కింద రూ.2,000 కోట్ల నిధులను రాబట్టేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ ( ఎంఏ&యూడీ) శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా  ఈ నెలాఖరు నాటికి సంబంధిత ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ప్రతిపాదనలను సేకరించి, ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తోంది. డీటీసీపీ విభాగం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను క్రోడీకరించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌‌‌‌లో సిద్ధం చేసి, ఈ నెలాఖరు నాటికి సమర్పించనుంది.

 జనవరి 2026 మొదటి వారంలో రూ.2 వేల కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నిధులతో టౌన్ ప్లానింగ్ స్కీమ్స్, ల్యాండ్ పూలింగ్, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌‌‌‌మెంట్ (టీఓడీ), స్పాంజి సిటీల ఏర్పాటు, అర్బన్ ఫారెస్ట్, నీటి వనరుల సంరక్షణ, గ్రీన్ బిల్డింగ్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. 

దీనిపై ఇప్పటికే నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌‌‌‌మెంట్ (ఎన్ఐయూఎం), కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) సంయుక్తంగా వర్క్‌‌‌‌షాప్ నిర్వహించాయి. ప్రతిపాదనలు తయారుచేయడం మొదలుకుని ఫైనల్ చేసే బాధ్యతలను డీటీసీపీకి అప్పగించారు.