రేట్ల కంట్రోల్​పై చేతులెత్తేసిన్రు...నియంత్రణ కమిటీలు పత్తా లేవు

రేట్ల కంట్రోల్​పై చేతులెత్తేసిన్రు...నియంత్రణ కమిటీలు  పత్తా లేవు
  • టమాట, మిర్చి, బియ్యం, చక్కెర, బియ్యం కందిపప్పు ధరలు పైపైకి..
  •  బ్లాక్ చేసి రేట్లు పెంచుతున్న హోల్​సేల్​వ్యాపారులు
  •  ఎక్కువ ధరకు అమ్మిన వ్యాపారులపై గతంలో చర్యలు
  •  సెపరేట్ కౌంటర్లలో అమ్మకాలు

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. బియ్యం, ఉప్పులు, పప్పులు, చక్కెర మొదలుకొని కూరగాయల దాకా ధరలు భగభగమండుతున్నాయి. ఇప్పటికే టమాట కిలో రూ.200 వరకు ఎగబాకింది. అదే కోవలో పచ్చి మిర్చి వంద దాటింది. బెండ, కాకర, చిక్కుడు, క్యాబేజీ తదితర 
కూరగాయల రేట్లు కిలో రూ.80కి చేరాయి. నెల క్రితం వరకు రూ.100 పెడ్తే  సంచి నిండా కూరగాయలు వచ్చేవి. కానీ, ఇప్పుడు రూ.300 పెట్టినా మూడు రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిని, మార్కెట్​లో కొరత ఏర్పడిందని హోల్​సేల్​, రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ, కొరతను సాకుగా చూపి వ్యాపారులు కూరగాయలతోపాటు అన్ని సరుకులను బ్లాక్​చేసి రేట్లు పెంచి అమ్ముతున్నారు. గతంలో ఇలా నిత్యవసరాల రేట్లు పెరిగినప్పుడు సర్కారు ముందుకు వచ్చి ప్రత్యేక కౌంటర్లు పెట్టి పప్పు, చక్కెర, ఉల్లిగడ్డలు లాంటి
వాటిని అమ్మి ధరలను కంట్రోల్​చేసిన దాఖలాలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిత్యవసరాల రేట్లను గాలికి వదిలేసింది. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడ్తున్నారు. 

రేట్లను శాసిస్తున్న హోల్​సేల్​ వ్యాపారులు

రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గిందని, దాంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్​లో లోకల్​ టమాట కనిపించకపోవడమే దీనికి నిదర్శమంటున్నారు. ప్రస్తుతం హైబ్రీడ్​ టమాట మార్కెట్​లోకి వస్తోందని అది కూడా సరిపడా రావట్లేదని చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో అతిపెద్దదైన ప్రకాశం బజార్​ మార్కెట్​కు ప్రతిరోజు 400 బాక్సుల టమాట అవసరంకాగా, 200కు మించి రావడం లేదు. ప్రకాశం, కర్నూల్​ జిల్లాల నుంచి ఉల్లి గడ్డ, టమాట వస్తోందని, ఇతర కూరగాయలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటున్నారు. కొరత ఉండడంతో హోల్​సేల్ వ్యాపారులు అడ్డూ అదుపు లేకుండా ధరలు నిర్ణయిస్తున్నారు. ఏ రోజు ఎంత రేటకు అమ్మాలో కూడా ముందే డిసైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఓపెన్ ​మార్కెట్​లో ధరలు అదుపు తప్పాయి. ఇంకోవైపు నిర్మల్, భైంసా వంటి ప్రాంతాల్లో బ్లాక్​ మార్కెట్​ చేసిన టమాటలు కుళ్లిపోవడంతో వాటిని రోడ్లపై పారబోశారు.  

సన్నబియ్యం నిల్వలు లేవంటున్న మిల్లర్లు

రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా వరి సాగవుతోంది. దొడ్డు రకం 70 శాతం సాగు చేస్తే సన్నాలు 30 శాతం పండిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్నాల స్టాకు మిల్లర్ల వద్ద ఉందని అధికారులు చెబుతుంటే లేవని వ్యాపారులంటున్నారు. మిల్లులో అక్రమ నిల్వలు వెలికితీసే అధికారం తమకు లేదని, గతంలో మాదిరి 'సి' సర్టిఫికెట్​, నిల్వ వివరాలను తనిఖీ చేసే పవర్స్​ను ప్రభుత్వం రద్దు చేసిందని  సివిల్​ సప్లయీస్​ అధికారులంటున్నారు. దీంతో ధరలను తమ కంట్రోల్​లో పెట్టుకున్న మిల్లర్లు అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది ఇదే రోజుల్లో సన్న బియ్యం కిలో రూ.43 ఉండగా, ప్రస్తుతం రూ.55 పలుకుతోంది. పాత బియ్యం క్వింటాల్​రూ.5,500 ఉండగా, స్టీమ్​రైస్​ రూ.4,800 పలుకుతోంది. 

జాడలేని రైతు బజార్లు...సపరేట్​ కౌంటర్లు 

గతంలో ధరలు అదుపు తప్పినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచి సబ్సిడీ రేట్లకు బియ్యం, పప్పు, ఉల్లిగడ్డలు, కూరగాయలు అమ్మేది. గతంలో కందిపప్పు, ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ధరలకే  అందించింది. సెపరేట్ ​కౌంటర్ల సంగతి దేవుడెరుగు..కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రైతు బజార్లు కూడా మూతపడ్డాయి. నల్గొండ మార్కెట్​లో రూ.70 లక్షలు పెట్టి కొత్తగా కట్టిన రైతుబజార్​ ఉదయం 10 గంటలకే బందవుతోంది. 

ధరల పర్యవేక్షణ కమిటీలు ఉత్తిదే..

రాష్ట్రంలో ధరలు అదుపు తప్పి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ధరలను కంట్రోల్ ​చేసిన జిల్లా ధరల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కాగితాలకే పరిమితమైంది. ధరల పర్యవేక్షణ కమిటీకి చైర్మన్​గా కలెక్టర్​ లేదా అడిషనల్​కలెక్టర్​ వ్యవహరిస్తారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కన్వీనర్​గా, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ, పౌరసరఫరాల సంస్థ డీఎం, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​తోపాటు నిత్యావసర సరుకులతో సంబంధమున్న అధికారులు మెంబర్స్​గా ఉంటారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఈ కమిటీ ప్రతి నెలా సమావేశం కావాలి. మార్కెట్​ధరలపై సమీక్ష చేయాలి. రేట్లు పెరిగితే వాటిని ఏవిధం గా కంట్రోల్​ చేయాలి? అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, రాష్ట్రంలో ఈ కమిటీలు ఇప్పటివరకు సమావేశాలు పెట్టిన దాఖల్లేవు.  

రేట్లు పెరిగినయ్​..గిరాకీ తగ్గింది..

వర్షాలు వస్తుండడంతో మార్కెట్​కు కూరగాయలు తక్కువ వస్తున్నయ్. టమాట, పచ్చిమిర్చి ధరలు విపరీతంగా పెరిగాయి. చిక్కుడు, బెండ, క్యాబేజీ తదితర కూరగాయల ధరలు కిలో రూ.50 పైనే అమ్ముతున్నాం. రేట్లు పెరగడం వల్ల గిరాకీ తగ్గింది. చాలామంది కొనేందుకే రావడం లేదు.  
- రవి, వ్యాపారి, ప్రకాశం బజార్

కూరగాయలు కొనలేకపోతున్నం 

కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాట కిలో రూ.200 చెబుతున్నరు. పచ్చిమిర్చి రూ.150 దాటింది. కాకర, బెండ, వంకాయ రేట్లు కిలో రూ.50 నుంచి రూ.60 చెబుతున్నరు. రూ.వందలు తీసుకుని పోతే మూడు రకాల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం కష్టమై పోయింది.
– జి.లక్ష్మీనారాయణ, నల్గొండ