ఆగష్టు 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తం

ఆగష్టు 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తం
  • 1,400 కోట్లు బకాయిలు చెల్లించకపోతే సేవలు బంద్ పెడ్తం
  • ఆరోగ్యశ్రీ సీఈవోకు ప్రైవేట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్స్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏ) ప్రకటించింది. గత జనవరిలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసినట్లు టీఏఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏ వెల్లడించింది. 

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,400 కోట్లు విడుదల చేయాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. జనవరిలో రూ.1,100 కోట్లుగా ఉన్న బకాయిలు ప్రస్తుతం పెరిగాయని, ఇది చిన్న, మధ్య తరగతి ఆస్పత్రులను మూసేసే పరిస్థితి ఉందని అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేశ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కాగా, గత జనవరిలో ఆరోగ్యశ్రీ సేవలు 10 రోజుల పాటు నిలిచిపోవడంతో బకాయిలను 4- నెలల్లో క్లియర్ చేస్తామని, క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారని టీఏఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏ  గుర్తుచేసింది.